Vijayawada MP : విజయవాడ పార్లమెంట్ స్థానంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారా? కొత్త అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారా? నందమూరి కుటుంబ సభ్యులు అయితే బాగుంటుందని భావిస్తున్నారా? కేశినేని నాని అహంకారానికి చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇటీవల వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఇలా వెళ్లిన నానికి వైసిపి ఇన్చార్జి పదవి కట్టబెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పుకొస్తుంది. కానీ ఈసారి కేశినేని నాని గెలవకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గ ప్లాన్ రూపొందించుకుంటున్నారు.
విజయవాడ ఎంపీ సీటు టిడిపికి కీలకం. ఒక బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుతో ఎంపీ సీటును టిడిపి కైవసం చేసుకుంటూ వచ్చింది. 2014లో తొలిసారిగా కేశినేని నానిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో నాని గెలుపొందారు. 2019 ఎన్నికల్లో సైతం జగన్ ప్రభంజనం వీచినా.. కేశినేని నాని మాత్రం గెలుపొందారు. అయితే అది పార్టీ విజయం కాదని.. తన వ్యక్తిగత చరిష్మ అంటూ కేశినేని నాని బలంగా భావించారు. అందుకే పార్టీ కి వ్యతిరేకంగా మారిపోయారు. ఎన్నికల ముంగిట వైసీపీలో చేరారు. అయితే కేశినేని నానికి సరైన బుద్ధి చెప్పాలని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థిని బరిలో దించాలని సూచిస్తున్నాయి.
అయితే కేశినేని నాని సోదరుడు చిన్నికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఆయన పార్టీని వీడారని ప్రచారం జరిగింది. కుటుంబ విభేదాలతోనే ఆయన టిడిపికి దూరమయ్యారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి టిడిపి అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తారని కూడా అంతా భావించారు. పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో చిన్ని యాక్టివిటీస్ పెరగడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.అయితే చిన్ని కంటే మరో అభ్యర్థి అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీలోకి వెళ్తూ వెళ్తూ.. 60 శాతం మంది టిడిపి క్యాడర్ ని తీసుకెళ్తానని కేశినేని నాని సవాల్ చేశారు. అందుకే నాని విషయంలో గట్టి దెబ్బ కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటుకు నందమూరి కుటుంబ సభ్యులకు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ఎన్నికల్లో సుహాసిని పోటీ చేశారు. ఆమె దివంగత హరికృష్ణ కుమార్తె. కళ్యాణ్ రామ్ సోదరి. టిడిపిలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆమె ఎంపీ అభ్యర్థి అయితే విజయవాడలో వార్ వన్ సైడేనని తెలుస్తోంది. నందమూరి కుటుంబం అనే సెంటిమెంటు సుహాసిని కి బాగా వర్క్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఒక మహిళ అభ్యర్థిగా గౌరవించినట్లు అవుతుందని.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం మద్దతు తెలపక తప్పదని భావిస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు విజయవాడ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.