Nadendla Manohar: ఏపీలో పొత్తు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టిడిపి, జనసేన కూటమిలోకి వెళ్లాలా? వద్దా? అని బిజెపి సీరియస్ గా ఆలోచిస్తోంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తోంది. అందులో భాగంగా జాతీయ స్థాయి నాయకుడు శివ ప్రకాష్ జి ఏపీలో పర్యటించారు. పొత్తులతో ఎలా ముందుకెళ్లాలో బిజెపి నేతల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. మరోవైపు వైసిపి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. కాంగ్రెసులోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలోకి వైసిపి అసంతృప్తులు చేరే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు షేర్ పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా బిజెపి ఉంది. కానీ ఆ పార్టీ బలం అంతంత మాత్రమే. ఈ తరుణంలో పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే బిజెపి నేతల అభిప్రాయాలను తీసుకొని… పార్లమెంటరీ బోర్డు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జాతీయస్థాయి నాయకుడు శివప్రకాష్ జి కి బిజెపి హై కమాండ్ పొత్తుల వ్యవహారాన్ని అప్పగించింది.
నిన్న విజయవాడలో పార్టీ శ్రేణులతో శివప్రకాష్ జి సమావేశం అయ్యారు. అంతకంటే ముందే జిల్లా పార్టీ అధ్యక్షులు, పదాధికారులతో సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను కూడా సహకరించారు. మరోవైపు ఏపీ బిజెపితో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తుల చర్చల నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీ పై ఏపీ బిజెపి పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. జనసేన మా మిత్రపక్షమేనని.. నాదెండ్ల మనోహర్ తో భేటీ మర్యాదపూర్వకమేనని స్పష్టం చేశారు. శివ ప్రకాష్ జీని కలవడానికి మనోహర్ వచ్చారని వెల్లడించారు. అయితే సరిగ్గా పొత్తుల చర్చల నేపథ్యంలోనే మనోహర్ అక్కడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తప్పకుండా బిజెపి కూటమిలోకి వస్తుందని.. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డులో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.