JP Nadda: బిజెపిని నాశనం చేసిన మీడియా అధిపతులతో నడ్డా సమావేశమా

ప్రస్తుతం తెలంగాణలో పోరాటం హోరా హోరీగా సాగనుంది. అధికార బి ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది.

Written By: Dharma, Updated On : October 7, 2023 6:11 pm

JP Nadda

Follow us on

JP Nadda: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. తెలంగాణకు ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణకు జాతీయ నాయకులు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్, బిజెపి అగ్ర నాయకులు భారీగా మోహరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ రెండు సభల్లో పాల్గొన్నారు. మరోవైపు హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వరుసగా పర్యటనలు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో పోరాటం హోరా హోరీగా సాగనుంది. అధికార బి ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. అందుకు ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలిస్తుంది.అయితే మునుపటిలా తెలంగాణలో ఆశించినంత ప్రభావం చూపలేకపోతుంది. ఒకానొక దశలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాబోతుందన్న వాతావరణం ఏర్పడింది. కానీ బండి సంజయ్ ని పక్కకు తప్పించిన తర్వాత సీన్ మారింది. క్రమేపి బిజెపి వెనక్కి వెళ్ళిపోయింది. మూడో స్థానానికి ఎగబాకినట్లు వార్తలు వస్తున్నాయి. అటు సర్వేల్లో సైతం ఇదే తేలుతోంది. కాంగ్రెస్ హవాను అడ్డుకునేందుకే.. బిజెపి పరోక్షంగా కేసీఆర్ కు సహకారం అందిస్తుందన్న వాదన తెలంగాణలో బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో బిజెపి గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిజెపి మల్ల గుల్లాలు పడుతోంది.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియా అధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ లను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేర్వేరుగా వారిని కలుసుకున్న నట పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.విశేషమేమిటంటే ఈ రెండు మీడియా హౌస్ లో బిజెపికి వ్యతిరేకం కంటే.. బిజెపి ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. అధికార బి ఆర్ ఎస్ కు ఈనాడు, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్కు ఆంధ్రజ్యోతి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పుడు అదే మీడియాకు చెందిన అధినేతలను నడ్డా కలవడం విశేషం.

అటు ఏపీలో సైతం రెండు మీడియా హౌస్ లో బిజెపికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. చంద్రబాబు అరెస్టు తరువాత.. జగన్కు బిజెపి సహకారం అందిస్తుందని.. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర నాయకత్వం ఉందని అర్థం వచ్చేలా కథనాలు ఈ రెండు మీడియాల ద్వారా ప్రజలకు బలంగా చేరుతున్నాయి. దీంతో భారతీయ జనతా పార్టీ తీరుపై ఏపీ ప్రజల్లో ఒక రకమైన అపవాదును ఏర్పరచడంలో ఈ రెండు మీడియాల పాత్రఉందని తేలుతోంది. అటు తెలంగాణలో అలా.. ఇక్కడ ఏపీలో ఇలా వ్యవహరిస్తూ వస్తున్న రెండు మీడియాలకు బిజెపి అగ్రనాయకత్వం సన్నిహితంగా మెలగడాన్ని.. స్థానిక పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

మీడియా అధినేతలకు జేపీ నడ్డా సమావేశం కావడం పై బిజెపి సీనియర్ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు తనదైన రీతిలో స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని బలహీనపరిచే క్రమంలో రామోజీరావు, రాధాకృష్ణులు ఉన్నారని.. అయినా పెద్ద మనసుతో కలిసేందుకు వచ్చిన జేపీ నడ్డా అభినందనీయులని.. ఇ ప్పటికైనా వారిద్దరూ తమ రాతలను మార్చుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ట్విట్ చేశారు.