Mystery Deaths : జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల ఓ రహస్య వ్యాధి కారణంగా మరణాలు సంభవించిన వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్ 7 నుండి జనవరి 19 వరకు బదాల్ గ్రామంలో మూడు కుటుంబాల్లో మొత్తం 17 మంది మృతిచెందారు. ఈ ఘటనల కారణంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే, కేంద్ర మంత్రి డా. జితేందర్ సింగ్ ఈ మరణాలకు రోగాలు కారణం కాదని టాక్సిన్‌ల వల్లనే ఈ మరణాలు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిందని ప్రకటించారు. లక్నోలోని సిఎస్‌ఐఆర్ ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరిశోధన ప్రకారం ఈ మరణాలకు ఇన్ఫెక్షన్‌లు, వైరస్‌లు, లేదా బాక్టీరియా కారణం కాదని తేలింది. నమూనాల్లో విషతుల్యమైన పధార్థాలు (టాక్సిన్స్) గుర్తించబడినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి టాక్సిన్‌ల ఆవిర్భావం ఎలా జరిగిందో లేదా వాటి మూలం ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంలో కుట్ర ఏదైనా ఉన్నా కనుగొని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
అంతకు ముందు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. బదాల్ గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ప్రజలలో భయాందోళనలు తగ్గించేందుకు సామూహిక వేడుకలు, ప్రైవేట్ సమావేశాలపై నిషేధం విధించారు. గ్రామంలోని నీటి వనరులు, ఆహార పదార్థాల నుండి తీసుకున్న 200కి పైగా నమూనాలను దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లకు పంపించారు.మరణాలకు గురైన బాధితుల్లో జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, తీవ్రమైన చెమటలు, చేతుల్లో మంటలు వంటి లక్షణాలు కనిపించాయి.
బాధితులందరూ ఆసుపత్రికి తరలించబడిన కొద్ది గంటల్లోనే మరణించారు. దీంతో గ్రామంలోని ‘బావ్లీ’ అనే నీటి మూలాన్ని టాక్సిన్ గుర్తింపు తర్వాత సీజ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ‘‘ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)’’ను ఏర్పరచింది. న్యూరోటాక్సిన్స్ (నరాలపై ప్రభావం చూపే టాక్సిన్‌లు) నమూనాల్లో కనుగొనబడినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.గ్రామ ప్రజలు ఉపయోగించే ఆహార పదార్థాల్లో విషతుల్యం ఉందని, దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని GMC రాజౌరీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. షుజా ఖాద్రి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బాధిత గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్ని కోణాల్లోనూ ప్రభుత్వ దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలకు అధికారులు కొద్ది రోజులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు పాటించాలని, ప్రాథమిక వైద్య సహాయం అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు.
రాజౌరీ జిల్లాలో జరిగిన ఈ అనూహ్య మరణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇప్పటి దాకా టాక్సిన్‌ల వల్లనే ఈ మరణాలు జరిగాయని స్పష్టమైన ఆధారాలు లభించాయి. అయితే, టాక్సిన్‌ల మూలం ఏంటన్న దానిపై పూర్తి వివరాలు మరో 10 రోజుల్లో వెల్లడికానున్నాయి. ఈ విషయంపై కేంద్రం, రాష్ట్రం నుండి గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు భయం అవసరం లేదని, భద్రత, ఆరోగ్యం పట్ల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.