Namasthe Telangana Daily: నమస్తే తెలంగాణ దినపత్రికలో తిరుగుబాటు.. ఉద్యోగుల మెరుపుసమ్మె వెనుక సంచలన నిజాలు

Namasthe Telangana Daily: అది ఉద్యమకాలంలో ఏర్పడిన పత్రిక. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యాక లక్ష్మీ రాజం నుంచి లాక్కున్న పత్రిక. ప్రభుత్వ ప్రకటనలే కాక ప్రైవేట్ ప్రకటనలు కూడా జాకెట్స్ రూపంలో పొందుతున్న పత్రిక. ఇన్ని అనుకూలతలు ఉన్నాకా అలాంటి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు దీలాసాగా ఉంటారు. కానీ కృ.తి అలియాస్ తిగుళ్ళ కృష్ణ మూర్తి రూపంలో ప్రవేశించిన శని వారికి అశని పాతంలా మారింది. అంతటి ఉద్యమ కాలంలోనూ నడిచిన పత్రిక, ధీమాగా ఉన్న […]

Written By: K.R, Updated On : August 3, 2022 3:24 pm
Follow us on

Namasthe Telangana Daily: అది ఉద్యమకాలంలో ఏర్పడిన పత్రిక. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యాక లక్ష్మీ రాజం నుంచి లాక్కున్న పత్రిక. ప్రభుత్వ ప్రకటనలే కాక ప్రైవేట్ ప్రకటనలు కూడా జాకెట్స్ రూపంలో పొందుతున్న పత్రిక. ఇన్ని అనుకూలతలు ఉన్నాకా అలాంటి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు దీలాసాగా ఉంటారు. కానీ కృ.తి అలియాస్ తిగుళ్ళ కృష్ణ మూర్తి రూపంలో ప్రవేశించిన శని వారికి అశని పాతంలా మారింది. అంతటి ఉద్యమ కాలంలోనూ నడిచిన పత్రిక, ధీమాగా ఉన్న ఉద్యోగులు… నేడు బేల చూపులు చూస్తున్నారు. జీతం పెరుగుదల కోసం రెండేళ్లు ఎదురు చూసి ఇక ఓపిక లేక మెరుపు సమ్మెకు దిగారు. ఇంతటి వైపరీత్యానికి ఒకే ఒక్క కారణం కృతి.

Namasthe Telangana Daily

రోడ్డున పడేశాడు

నమస్తే తెలంగాణ సంస్థల్లో సుమారు 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి పత్రికకు అనేక రకాలుగా తోడ్పాటునందిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు మంచిగానే ఇంక్రిమెంట్లు పడ్డాయి. ఎప్పుడైతే అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారో .. అప్పుడే ఎడిటర్ గా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బావమరిది కట్ట శేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన పని తీరుపై మొదటినుంచి కేటీఆర్ అసంతృప్తితో ఉన్నారు. జగదీష్ రెడ్డి బామ్మర్ది కనుక ఏమి అనలేని స్థితి. ఇదే క్రమంలో ఆయనను సహచట్టం చైర్మన్ గా బయటకు పంపారు. ఆ స్థానంలోకి ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ ఇంచార్జ్ తిగుళ్ల కృష్ణమూర్తిని నియమించారు. ఇందుకు మూడేళ్ల పాటు బాండ్ రాయించుకున్నారు. అంతకుముందే టిఆర్ఎస్ ముఖ్యులతో కృష్ణమూర్తికి మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకు పూర్తి అధికారాలు అప్పగించారు. ఇదే అదునుగా నమస్తే తెలంగాణలో కృష్ణమూర్తి అలియాస్ కృతి రెచ్చిపోయారు.

Also Read: Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఆ హీరోయిన్లను వాడుకున్నాడా?

ఒకప్పుడు తనతో పాటు పనిచేసిన పెద్ద కృష్ణమూర్తి… ప్రస్తుతం నమస్తే తెలంగాణ సెంట్రల్ డెస్క్ ఇంచార్జ్ పై పడ్డారు. అతని టీంను బయటికి పంపించారు. తెగుళ్ల కృష్ణమూర్తి ఎంటర్ అయిన సమయంలోనే కరోనా కూడా ఎంటర్ అయింది. ఈ ప్రభావంతో నమస్తే తెలంగాణ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు ఉద్యోగులపై ఎటువంటి జాలి, కరుణ లేకుండా పొమ్మన లేక పొగ పెట్టేవారు. ఆంధ్రజ్యోతిలో తనతో పాటు పనిచేసిన అందర్నీ తీసుకొచ్చుకున్నారు. పేపర్లోని ప్రతి పేజీలో తను చెప్పిన వార్తలే ఉండేలా చూసుకున్నారు. పైగా ప్రతివారం కృ.తి పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాసాలు రాస్తుండటంతో కేటీఆర్ కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. పైగా కృష్ణమూర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఇలా రెండేళ్లు గడిచాక ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పైగా తనతో పాటు తెచ్చుకున్న ఆంధ్రజ్యోతి టీంకు కృష్ణమూర్తి ఇష్టానుసారంగా జీతాలు ఇప్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మెరుపు సమ్మె

వాస్తవానికి నమస్తే తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం కడుదయనీయంగా మారింది. జీతాలు పెరగక వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. పైగా కృష్ణమూర్తి రాకతో వారి పరిస్థితి పెనం నుంచి పోయిలో పడ్డట్టుగా మారింది. మేనేజ్మెంట్ ని కలిసినా ఉపయోగం లేకపోవడంతో వారి వేదన అరణ్యరోదన అయింది. ఈ తరుణంలో మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ ఎడిషన్ లో ఎడిటోరియల్ పెన్ డౌన్ ప్రకటించింది. విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి మొదట నెట్వర్క్ ఇంచార్జ్ శ్రీనివాసరావుతో మాట్లాడించారు. ఉపయోగం లేకపోవడంతో తానే రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఉద్యోగులు బెట్టువీడ లేదు. యాజమాన్యంతో మాట్లాడి ఇంక్రిమెంట్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు. తర్వాత నిన్నటికి నిన్న హకీంపేట మెయిన్ ప్రింటింగ్ ప్రెస్ లో సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. రెండేళ్లుగా తమకు జీతాల పెరుగుదల లేదని, ఇలాంటి స్థితిలో పేపర్ ను ఎలా ప్రింట్ చేస్తామని వారు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కృష్ణమూర్తి వారితో మాట్లాడలేక నెట్వర్క్ ఇన్చార్జి శ్రీనివాసరావును రంగంలోకి దించారు. ఆయన వారితో మాట్లాడి, యాజమాన్యం ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే నేను కూడా మీతో పాటు సమ్మె చేస్తానని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Namasthe Telangana Daily

కృష్ణమూర్తి ఇష్టారాజ్యం

ఎప్పుడైతే కృష్ణమూర్తి నమస్తే తెలంగాణలోకి వచ్చారో అప్పుడే వ్యవస్థ మొత్తం కట్టు తప్పిపోయింది. ఎడిటోరియల్ టీం మొత్తం తన వాళ్లే ఉండేలాగా చేసుకున్న కృష్ణమూర్తి… మొదటినుంచి నమస్తే తెలంగాణలో పనిచేస్తున్న వారందరినీ బయటకు వెళ్ళగొట్టారు. పైగా వారిపై రకరకాల ఆరోపణలు చేశారు. ఈ విషయం కేటీఆర్ దృష్టిలో పడకుండా జాగ్రత్త పడ్డారు. పైగా ఇటీవల కేటీఆర్ వద్దకు ఇంక్రిమెంట్లు వేయాలని నమస్తే తెలంగాణ ఎడిటోరియల్ టీం వెళ్ళగా ఆయన ఫోన్ చూస్తూ కాలక్షేపం చేశారు. దీంతో గత్యంతరం లేక వారు వెనుతిరిగారు. ప్రస్తుతం నిరుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యోగులు… రేపటి నాడు పేపర్ మొత్తాన్ని నిలుపుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ ఈనాడు పత్రికలో ఇదే దుస్థితి నెలకొనగా అప్పట్లో యాజమాన్యం కార్మిక శాఖతో ఉద్యోగులపై వేధింపులకు పాల్పడింది. పైగా ఉద్యోగులతో బలవంతపు రాజీనామాలు చేయించి గోల్డెన్ షేక్ హ్యాండ్ కింద నగదు ఇచ్చింది. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ను మొత్తం కళాజ్యోతి సంస్థకు అప్పగించింది. నమస్తే తెలంగాణలో కూడా అవే పరిణామాలు కనిపిస్తున్నాయి. కళా జ్యోతి సంస్థకు ప్రింటింగ్ బాధ్యతలు అప్పగిస్తే తాము రోడ్డు మీద పడతామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈనాడు చూపించిన ఉదారత నమస్తే తెలంగాణ యాజమాన్యం తమపై చూపదని ఉద్యోగులు అంటున్నారు. వందల కోట్ల ఆదాయం పొందుతున్న నమస్తే తెలంగాణ… తమ జీతాల విషయానికి వచ్చే సరికి ఇబ్బందులు పెడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిగుళ్ల కృష్ణమూర్తి తో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అగ్రిమెంట్ ముగుస్తుంది. కేటీఆర్ కూడా ఏమీ అనలేని పరిస్థితి. అప్పటివరకు వేచి చూసే ధోరణిలో కేటీఆర్ ఉన్నారు. సో అప్పటి దాకా నమస్తే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ఎన్ని పెన్ డౌన్లు చేసినా, మెరుపు సమ్మెలు చేసినా నో యూజ్.

Also Read:Nancy Pelosi Taiwan Visit: చిచ్చుపెట్టిన అమెరికా.. తైవాన్ పై చైనా యుద్ధం చేయబోతుందా?

Tags