Moinabad Farm House- Munugode By Election: నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. కానీ ఇప్పుడు అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిని బిజెపి,కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా మునుగోడు దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా రికార్డు సృష్టిస్తోంది.. ఇక నువ్వా నేనా అన్న పరిస్థితి నుంచి చావో రేవో అన్న భావన దాకా మునుగోడు ఎన్నిక వెళ్లిపోయింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏకంగా ₹100 కోట్ల చొప్పున ఆఫర్ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పటిదాకా గ్రామస్థాయి నేతల కొనుగోలులో పోటీపడిన ప్రధాన పార్టీలు.. ఆ తర్వాత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వల వేసే దాక చేరింది. పోలీసులు రికార్డు చేశామని చెబుతున్న ఆడియో, వీడియోల ప్రకారం ఒకో ఎమ్మెల్యేకు ఏకంగా ₹100 కోట్ల వరకు ఆఫర్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు కలిపి ₹400 కోట్ల దాకా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

వాస్తవానికి దేశంలోనే ఎక్కడా ఎప్పుడూ లేనంత ఆఫర్ ఇది. ఇది రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పేది అని బలంగా నమ్ముతుండడంతో రాజకీయ పార్టీలు ఏ స్థాయికైనా వెళ్లే పరిస్థితిని కల్పించింది.. స్థానిక ప్రజాప్రతినిధుల్లో 80 శాతం మంది పార్టీలు మారడం, అది కూడా ఒక్కసారే కాకుండా రోజుల వ్యవధిలోనే రెండు, మూడు సార్లు పాత జెండాలు వదిలేసి కొత్త కండువాలు కప్పుకోవడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, మునిసిపల్ కౌన్సిలర్లు… ఇలా స్థానిక ప్రజాప్రతినిధులు దాదాపుగా పార్టీలు మారిన వారే. పార్టీలు మారకుండా ఉన్న వాళ్లను వేళ్ళ మీద లెక్కించవచ్చు. తొలి దశలోనే ఆ కార్యక్రమం కాని చేసిన రాజకీయ పార్టీలు.. మలిదశలో ఇంకాస్త పెద్ద నేతలపై దృష్టి సారించాయి. లో భాగంగా బిజెపి కొంతమందిని పార్టీలో చేర్చుకుంటే.. మరికొంతమందిని టీఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకుంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను భారతీయ జనతా పార్టీ ఆకర్షించగా.. దానికి ప్రతిగా టిఆర్ఎస్ గౌడ సామాజిక వర్గానికి చెందిన అనేకమందికి తమ కండువా కప్పింది. పల్లె రవికుమార్ నుంచి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ వరకు పలువురుని పార్టీలోకి ఆహ్వానించింది.
ఇప్పుడు మూడో స్థాయికి
మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఆపరేషన్ ఆకర్ష్ మూడో స్థాయికి వెళ్ళింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. అది కూడా ఊహించిన భారీ మొత్తాన్ని ఆఫర్ చేసే స్థాయికి చేరుకుంది. బిజెపి తరఫున ఇద్దరు స్వామీజీలు, నందకుమార్ అనే వ్యక్తి కలిసి ఈ వ్యవహారాన్ని నడిపించాలని పోలీసులు చెబుతున్నారు. మునుగోడుకు వచ్చిన ఉప ఎన్నికను అన్ని పార్టీలు ఒక రాజకీయ ఉపద్రవంగా చూస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి మరో ఏడాది పాటు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. ఆ తర్వాత మళ్లీ శాసనసభకు సాధారణ ఎన్నికలు వస్తాయి. ఒక ఏడాది ఉండే ఎమ్మెల్యే పదవి కోసం వ్యక్తులుగా కంటే, పార్టీలుగా కంటే రెండు ప్రభుత్వాల మధ్య పోరుగానే ఇది పరిణమించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గ్రామానికి ఇన్చార్జిగా ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని కూడా అక్కడే మోహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… ఇలా మొత్తం 86 మందిని అక్కడే దించారు. వీరికింద మళ్ళీ ఒక్కో యూనిట్ కు 50 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో బిజెపి కూడా తన శక్తిని మొత్తం ఇక్కడే కేంద్రీకరిస్తున్నది.
ఏకంగా కేంద్ర ప్రభుత్వం, హోం శాఖ మంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షణ చేయడం, ఈ ఉప ఎన్నికల గెలిస్తే ఇక రాజాధికారం మాది అనే స్థాయిలో సర్వశక్తులు కేంద్రీకరిస్తోంది. కాంగ్రెస్ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నా ఆ పార్టీ ఆర్థిక బలంలో వెనుకంజులో ఉంది. టిఆర్ఎస్, బిజెపి మధ్య తీవ్రమైన పోటీ కారణంగా మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారిపోయింది. ప్రజాస్వామ్యాన్ని హాస్యం చేసే స్థాయికి దిజారింది.

రికార్డు స్థాయిలో ధన ప్రవాహం
మునుగోడు ఉపఎన్నిక మొత్తంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది. సాధారణంగా ఏ ఎన్నికలనైనా కొంత ధన ప్రవాహం ఉంటుంది.. ఒక్కోసారి శృతి మించుతుంది. ఆ రికార్డుల మొత్తాన్ని దాటేసిన విపరిణామం మునుగోడు లోనే కనిపిస్తోంది. ధన ప్రవాహం, ఓటర్లకు తాయిలాలు, మందు, విందులోనే కాదు పక్క పార్టీ నేతలకూ వల వేయడంలోనూ రికార్డు సృష్టించింది. అత్యధిక స్థానిక ప్రజా ప్రతినిధులు 10 రోజుల సమయంలో పార్టీలు మార్చడంలో రికార్డు సృష్టించింది.. అన్నింటికీ మించి ఎన్నికలు ఇంతలా డబ్బుమయం అయిపోతాయా? భవిష్యత్తు రాజకీయం ఎలా చేయగలం అనే భయాన్ని చివరికి రాజకీయ నేతల్లోనూ సృష్టించాయి. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఘటన వెనుక మునుగోడు ఉప ఎన్నిక ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో రాజకీయ పార్టీలు ఎందాకైనా తెగిస్తున్నాయి. ఇది మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది.