Munugode By-Election 2022: తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టంతా మునుగోడుపైనే ఉంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. మునుగోడు గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతున్నామన్న సంకేతం జనంలోకి పంపాలని అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు దూకుడు మీద ఉన్న బీజేపీ కూడా ఉవ్విల్లూరుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. మరోవైపు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.
అక్టోబర్ షెడ్యూల్..
మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాషాయం గూటికి వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని ఎలాగైనా గెలిపించాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన రాజీనామాతోనే రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి నిధులు, పింఛన్లు, సబ్సిడీ గొర్రెలు అందిస్తోందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక ఎప్పుడన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చిన హోమంత్రి అమిత్‌షా క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. వచ్చే నెలాఖరులో షెడ్యూల్ రావొచ్చని ఆయన సంకేతాలిచ్చారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒక స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా ఏమైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే వాటితోపాటు కలిపి ఎన్నికలు నిర్వహిస్తుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరగాల్సి ఉంది.
Also Read: Pawan Kalyan- Chiranjeevi: చిరంజీవితో పవన్‌కళ్యాణ్‌కు చెక్.. వైసీపీ అసలు వ్యూహం ఏంటి?
మునుగోడుకు ప్రత్యేక షెడ్యూల్..
ఈసీ అనుకుంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే మునుగోడు ఉపఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే అది మరీ ఆలస్యం. అందుకే మునుగోడు ఉపఎన్నికల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే నెల అంటే అక్టోబర్ చివరిలో షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలిచ్చారని చెబుతున్నారు. కానీ ఆయన కూడా ఉపఎన్నిక ఎప్పుడు ఉంటుందని చెప్పలేదు.
ఈసీ నిర్ణయమే ఫైనల్..
ఎన్నికల షెడ్యూల్‌పై ఎన్నిలక సంఘం అధికారులు సూచన ప్రాయంగా సమాచారం ఇచ్చినా ఫైనల్ నిర్ణయం మాత్రం ఈసీదే ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల కోసం ఈసీ వైపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు అంతర్గతంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంలో కేంద్రానికి కానీ ఇతర పార్టీలకు కానీ చాయిస్ ఉండదు. అయితే అనధికారికంగా ఈసీపై కేంద్రంపై పట్టు ఉంది. బీజేపీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఉంది. అందుకే బీజేపీ ఎప్పుడు ఉపఎన్నిక కావాలని అనుకుంటే అప్పుడే ఈసీ షెడ్యూల్ ఇస్తుందని ప్రచారం జరగుతోంది.
Also Read:JanaSena- Pawan Kalyan: జనసేన సర్వేలు: పవన్ కింగ్ మేకర్.. వైసీపీ పరిస్థితి ఇదీ.. ఏం తేలిందో తెలుసా?