BJP MLA Muniratna: ఇక ఇలాంటి పరిణామమే కర్ణాటకలో చోటుచేసుకుంది. “భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చుతున్నాం.. మేము ధార్మిక పరిపాలన కొనసాగిస్తున్నాం.. గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని” బిజెపి నాయకులు చెబుతుంటారు కదా.. ఆ పార్టీ ఎమ్మెల్యే అత్యంత నీచమైన పనికి ఒడిగట్టాడు. రాజకీయాలలో ప్రత్యర్థులపై వలపు వల విసిరేందుకు ఏకంగా ఒక హెచ్ఐవి వచ్చిన మహిళను ఉపయోగించుకున్నాడు. పైగా మరో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా ఆ ఎమ్మెల్యే వ్యవహారం వివాదానికి కారణమైంది. అక్కడి కాంగ్రెస్ పార్టీకి అనుకోని బలం లాగా మారింది.. ఆ బిజెపి ఎమ్మెల్యే పేరు మునిరత్న.. గతంలో ఓ కేసులో ఆయన అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ నుంచి బయటికి వచ్చాడు. ఈ క్రమంలో తన ప్రత్యర్థి పార్టీల నాయకులపై హెచ్ఐవి సోకిన మహిళతో వలపు వల విసిరాడు. ఇదే విషయాన్ని మరో మహిళతో చెప్పాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే మునిరత్న, ఆ మహిళ మధ్య ఏం జరిగిందో తెలియదు గాని.. ఆమె ఒక్కసారిగా సంచలన విషయాలను వెల్లడించింది. ” నాకు ప్రత్యర్ధులు చాలా ఎక్కువ. వారు ఆ పార్టీలో ఉన్నారు. అందులో ఉన్న ఓ నాయకుడిని బద్నాం చేయడానికి హెచ్ఐవి సోకిన మహిళను వలపు వల కోసం ఉపయోగించుకున్నా. మరో నాయకుడిని కూడా ఇలాగే ముగ్గులోకి దించేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందుకోసం హెచ్ఐవి సోకిన మరో మహిళ నాకు కావాలి. దీనికోసం నువ్వు ఏమైనా చేయగలవా” అని నన్ను మునిరత్న అడిగాడని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు ఆమె నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆమె వివరించింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం
మునిరత్నపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. దీనిపై విచారణ నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీపీ పీకే సింగ్ ఆధ్వర్యంలో ఐపీఎస్ అధికారులు లభురామ్, సౌమ్యలత, సి ఎ సైమన్ సిట్ లో సభ్యులుగా ఉన్నారు.. ముని రత్న పై వారం వ్యవధిలో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఒక మహిళపై లైంగికంగా దాడికి పాల్పడటం.. కులం పేరుతో ఒక కాంట్రాక్టర్ ను దూషించడం వంటి కేసులకు సంబంధించి ఆయనపై రెండు ఎఫ్ఐఆర్ లు ఇప్పటికే నమోదయ్యాయి. తాజాగా లైంగిక దాడి కేసుకు సంబంధించి మూడవ ఎఫ్ఐఆర్ ఆయన పై నమోదయింది. మునిరత్న ఇటీవల దళితులపై దుర్భాషలాడిన కేసులో బెయిల్ పైకి వచ్చారు. తాజాగా లైంగిక దాడి కేసులను పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మునిరత్నను 14 రోజులపాటు పోలీస్ కష్టానికి అప్పగిస్తూ అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బిజెపి నాయకులు ఆచితూచి
ముని రత్నపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక బిజెపి నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఈ విషయంపై చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ముని రత్న వ్యవహారంలో కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేస్తున్నారు. “ముని రత్నపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై ఎటువంటి నిర్ణయమైనా కేంద్ర అధినాయకత్వం తీసుకోవాలి. ఈ విషయంపై మేము మాట్లాడేందుకు అవకాశం లేదని” బిజెపి క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెంట్ లింగరాజ్ పాటిల్ చెబుతున్నారు. మునిరత్నపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి కదా.. అని విలేకరులు ప్రశ్నిస్తే.. అది తన పరిధిలో అంశం కాదని ఆయన సమాధానం దాటవేశారు.