Mudragada Chandrababu: చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. అధికారంలో ఉండగా రెచ్చిపోయి.. అధికారం కోల్పోయాక ప్రత్యర్థుల ప్రతాపంతో వలవలా ఏడిస్తే అది కన్నీరు అవ్వదు.. మొసలి కన్నీరే అవుతుంది. దాన్ని తన బలమైన మీడియాతో ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేసినా సరే అది దక్కదు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అలానే తయారైందట..
Also Read: ముద్రగడ తీరు పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగానేనా..?
చంద్రబాబు.. 40 ఇయర్స్ పాలిటిక్స్ లో ఎన్ని చూశాడు.. ఎన్నో చేశాడు. సొంత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నే గద్దెదించి సీఎం అయ్యి.. తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకొని నందమూరి కుటుంబానికి ఛాన్స్ లేకుండా చేసి.. ఇక ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో బలమైన మీడియా, శక్తి యుక్తులతో ప్రత్యర్థులను ఎంతలా ఆడించాలో అంతా ఆడించేశాడు.
ఇప్పటికే చంద్రబాబును గొప్ప మేనేజ్ మెంట్ గురూగా అభివర్ణిస్తుంటారు. ఆయనపై ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నిలబడలేదు. చంద్రబాబును మించిన మేనేజర్ లేడంటారు. అయితే నాడు వైఎస్ఆర్ నుంచి కేసీఆర్,జగన్ ల వరకూ ఇబ్బంది పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ సీఎం జగన్ నవతరం బూతు రాజకీయాలకు తట్టుకోలేకపోతున్నారు. వలవల ఏడ్చేశారు కూడా. అయితే చంద్రబాబు ఏడుపుపై సానుభూతి రాకపోగా కౌంటర్ అటాక్స్ వస్తున్నాయి. చంద్రబాబు చేసిన దానికి ఇది తక్కువేనని చాలా మంది ఆడిపోసుకుంటున్నారు.
చంద్రబాబు ఏడుపుపై తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయానని అభిప్రాయపడ్డారు. కాపుల కోసం నాడు నేను దీక్ష ప్రారంభిస్తే అవమానించారని.. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటుకాలితో తన్నారు. నా భార్య, కుమారుడు , కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను, నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫొటోలు తీయించి చూసేవారు ’ అంటూ ముద్రగడ నాటి తన గాయాలను ఎత్తిచూపి చంద్రబాబును చీల్చిచెండాడాడు.
గతంలో చేసిన మీ హింస అవమానంతో తట్టుకోలేక నిద్రలేని రాత్రులు గడిపామని.. అణిచివేతతో తమ కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలనుకున్నామని ముద్రగడ.. చంద్రబాబు చేష్టలను ఎండగట్టారు.
మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా’ అని ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని ఎంతో అవమానించిన ‘మీ నోటి వెంట ఇప్పుడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు.
మీడియా ముందు కన్నీల్లు కార్చి సానుభూతి పొందే అవకాశం మీకే ఉందని.. ఆ వేళ నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాథను చేశారు. మీరు శపథాలు చేయకండి చంద్రబాబు అంటూమీకు నీటి మీద రాతలని గ్రహించండి’ అంటూ సంచలన లేఖతో ముద్రగడ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.
దీన్ని బట్టి చంద్రబాబు కన్నీళ్లకు సానుభూతి కంటే ఆయన చేసిన చేష్టలతో వ్యతిరేకతనే ఎక్కువ వస్తోందని అర్థమవుతోంది. చంద్రబాబు పతనం చూశానని ముద్రగడ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అయ్యాయి.