Mudragada Padmanabham- Janasena: కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారన్న వార్త ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ముద్రగడ దశాబ్దాలుగా కాపు ఉద్యమంలో పనిచేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం పతాకస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కాపుల కోపం చవిచూసిన చంద్రబాబు చాలా దెబ్బతిన్నారు. జగన్ కు మాత్రం రాజకీయంగా మంచి లబ్ధి చేకూరింది. కాగల కార్యం ముద్రగడ రూపంలో జగన్ నెరవేర్చుకున్నారు. అయితే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ కాపు ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. తోటి కాపులు, సంఘాలు తనను అనుమానంగా చూస్తున్నందునే కాపు ఉద్యమాన్ని ఆపు చేస్తున్నట్టు కారణం చూపారు. అప్పటి నుంచి అడపదడపా జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు లేఖలు రాస్తూ ఉండే ముద్మగడ ఇంటికే పరిమితమయ్యారు. ఉద్యమ సమయంలో ఆయనతో పాటు ఉద్యమకారులపై నమోదైన కేసులను జగన్ సర్కారు రద్దుచేసిన నేపథ్యంలో ముద్రగడ వైసీపీలో చేరతాని ప్రచారం జరిగింది. ఆయన కాకపోయినా.. ఆయన కుమారుడు చేరుతారని వచ్చిన ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.

తాజాగా జనసేన, టీడీపీ దగ్గరవుతున్న నేపథ్యంలో ముద్రగడను వైసీపీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరగుుతున్నాయని ప్రచారం సాగింది. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్పిస్తే మిగతా ఏ పదవులనైనా ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని కొందరు మంత్రులు రాయభారం పంపారు. అయితే వాటిపై కూడా ముద్రగడ స్పందించలేదు. సుదీర్ఘ కాపు ఉద్యమంలో ఆయనకు తగిలిన ఎదురుదెబ్బలే అందుకు కారణం. ఇప్పుడు కానీ తాను వైసీపీలో చేరితే గత ఎన్నికలకు ముందు వైసీపీ కోసమే ఉద్యమం చేసినట్టు ప్రత్యర్థులు ప్రచారం చేస్తారని.. అప్పుడు ఇన్నాళ్లు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరై పోతుందని.. పైగా పార్టీలో చేరిన తరువాత జగన్ మనస్తత్వం ఎలా మారిపోతుందోనన్న భయం ముద్రగడను వెంటాడింది. అందుకే రాయభారానికి వచ్చిన మంత్రులకు తనకు అలాంటి ఆలోచన లేదని చెబుతూనే జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నానని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే కాపుల ప్రత్యేక పథకాలు, రాయితీలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. కాపులను అణచివేసే పార్టీలోకి కాపు ఉద్యమ నేతగా ఎలా చేరాలంటూ ప్రశ్నించడంతో వారంతా వెనుదిరిగినట్టు తెలుస్తోంది.

అయితే ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలంటే జనసేన తప్పించి ప్రత్యామ్నాయం లేదు. అటు టీడీపీలోకి వెళ్లలేరు. బీజేపీలోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ముద్రగడకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం జనసేనయే. కాపు సామాజికవర్గం వారికి వేదికగా నిలిచే జనసేనే సేఫ్ జోన్. అటు అభిమానులు, అనుచరులుకూడా ఆ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. పైగా కాపు ప్రాబల్యం చూపించుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. వైసీపీలోకి వెళితే అంత స్వేచ్ఛ ఉండదు. విలువ అంతకంటే ఇవ్వరు. పైగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఆ పార్టీ మూట గట్టుకుంది.జనసేనలో చేరితే కుమారుడికి రాజకీయ భవిష్యత్ కల్పించవచ్చు. తాను పెద్దన్న పాత్ర పోషించవచ్చు. అందుకే ముద్రగడ సమయం చూసి జనసేనలోకి జంప్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.