Mudragada : వైసీపీ ట్రాప్ లో ముద్రగడ పద్మనాభం పడ్డారా? లేక తన వ్యూహంలో భాగంగా చిక్కారా? సరిగ్గా పవన్ ఇష్యూలోనే ముసుగు తీశారెందుకు? పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారెందుకు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి పరోక్ష సాయమందించారన్న ఆరోపణ ముద్రగడపై ఉంది. అయితే గత నాలుగేళ్లుగా వైసీపీ హయాంలో ఎటువంటి పదవులు పొందలేదు. సరిగ్గా ఇప్పుడు వైసీపీకి ప్రతికూల సమయంలో ముద్రగడ అటువైపు అడుగులు వేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అనవసరంగా ముద్రగడను బలిపశువు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు దశాబ్దాలుగా ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. రాజకీయ ఉనికి కోల్పోయారు. కేవలం కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఉండిపోయారు. సహజంగా ఎంపీతో పాటు మంత్రి పదవులు అనుభవించిన ఆయనకు రాజకీయ ఆకాంక్ష ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఓ సామాజికవర్గం కోసం పోరాటం చేయడం, అది కూడా సవ్యంగా చేయకపోవడంతో ఒకరకమైన అపవాదు ఉండిపోయింది. దీంతో రాజకీయంగా వెనుకబడిపోయారు. కానీ గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ సర్కారుకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతగా చేశారు. జగన్ కు పరోక్షంగా సహకారం అందించారు. ఇప్పుడు అదే వైసీపీలోకి వెళదామనుకుంటున్నారు. అయితే అది వైసీపీకి లాభం తప్ప తనకు మాత్రం ఎంతమాత్రం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే పిఠాపురం నియోజకవర్గంపై ముద్రగడకు ప్రత్యేక ఆసక్తి ఉంది. పవన్ కు సవాల్ చేసే క్రమంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టేశారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు తరచూ ముద్రగడను కలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందట. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారు. వెనుకబడిన 18 మంది ఎమ్మెల్యేలు ఈయన ఒకరట. అందుకే ఈయన మార్పు అనివార్యంగా మారిందట. ఈయనతో పాటు గోదావరి జిల్లాల్లో చాలామంది ఉన్నారుట. అయితే పిఠాపురం నుంచి దొరబాబును మార్చి ఆ స్థానాన్ని ముద్రగడకు అప్పగించడానికి వైసీపీ సిద్ధపడిందట. కానీ ముద్రగడ తన కోసమే వైసీపీ హైకమాండ్ సెడన్ గా ఆ స్థానం ఖాళీ చేసిందని భావించారుట. అందుకే తాడేపల్లి ఆదేశాలు వచ్చిందే తడవు పవన్ కు సవాల్ విసిరారట.
పిఠాపురంలో వైసీపీకి ఏమంత ఆశాజనకంగా లేదు. అక్కడ కాపు సామాజికవర్గం ఎక్కువ. కానీ పవన్ కు కాపులు సాలీడ్ గా సపోర్టు చేస్తున్నారు. ముద్రగడ వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేరుట. ఇప్పటికే కాపు రిజర్వేషన్ అమలుచేయలేనని జగన్ చెప్పినా ముద్రగడ ప్రశ్నించకపోవడం, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పిఠాపురం కాపులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ తరుణంలో ముద్రగడ పిఠాపురం వచ్చినా ఓడించి తీరుతామని ప్రతినబూనుతున్నారు. అయితే పవన్ పై ఉసిగొల్పి కాపులను కొంతవరకూ అడ్డుకట్ట వేస్తామని భావిస్తున్న వైసీపీ ముద్రగడను బలిపశువు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కానీ ముద్రగడ మాత్రం కాపులకంటే తనకు వైసీపీ క్షేమమే ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు.