Chiranjeevi Jagan: ఆగని రావణకాష్టంలా రగులుతున్న సినిమా టికెట్ల వివాదం ఎట్టకేలకు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ఒక్కరొక్కరుగా నోరు తెరుస్తున్న వేళ తాజాగా ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు పెద్దదిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవిని ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లంచ్ మీటింగ్ కోసం పిలిచారు. దీంతో సినిమా వివాదానికి జగన్ ముగింపు పలుకబోతున్నారని తెలుస్తోంది.
చిరంజీవి ఈరోజు ఉదయం 9 గంటలకు అమరావతి వెళ్లనున్నట్లు అధికారిక సమాచారం. ఈ సమావేశం ప్రధానంగా సినిమా టిక్కెట్ ధరలపై జరుగుతుందని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా సామరస్య పరిష్కారం దొరుకుతుందని సినీ ఇండస్ట్రీ వేయికళ్లతో ఎదురుచూస్తోంది.
కొద్దిరోజుల క్రితమే దర్శకుడు రాంగోపాల్ వర్మను సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఇదే అంశంపై చర్చించేందుకు ఆహ్వానించి ఆయన ఇచ్చిన సూచనలను కూడా తీసుకున్నారు. వీటిని ప్రత్యేక కమిటీతో కూడా పంచుకుంటామని చెప్పారు.
ఇప్పుడు చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారంటే సినీ పరిశ్రమ పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవచ్చు.
సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల తరుఫున సామరస్యంగా చర్చించి పరిష్కరించాల్సిన సమస్యలను చెప్పగల ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని ఏపీ ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు ఇది స్పష్టంగా తెలియచేస్తోంది.