Covid-19: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు తగ్గుతుందనుకున్న వైరస్ ఒక్కసారిగా పెరుగుతూ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం బ్రిటన్ లో 50 కేసులు వెలుగు చూడటంతో రష్యా, ఉక్రెయిన్, రుమేనియా లాంటి దేశాల్లో వ్యాధి తీవ్రత పెరుగుతోంది. దీంతో కొవిడ్ నిబంధనలు మళ్లీ అమలు చేసేందుకు దేశాలు సిద్ధమవుతున్నాయి.

రష్యాలో ఒక్క శుక్రవారం రోజు 37,141 కేసులు వెలుగు చూడటంతో ప్రజలు భయపడుతున్నారు. వైరస్ తీవ్రత పెరుగుతున్నందున 1064 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో మరణాల సంఖ్య 2,28,453 కు చేరింది. కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసేందుకు నిర్ణయించాయి. వైరస్ తీవ్రత ఎక్కువవుతున్న సందర్భంలో లాక్ డౌన్ విధించేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈనెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు కార్యాలయాలు మూసివేస్తామని ప్రకటించారు.
మాస్కోలో ఈనెల 28 నుంచి లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 45 శాతం మందికే వ్యాక్సిన్ వేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో కొత్తగా 23,785 కేసులు, 614 మరణాలు సంభవించాయి. ఇక్కడ 15 శాతం మందికి మాత్రమే టీకాలు వేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు సుమారు 27 లక్షల మంది కొవిడ్ బారిన పడ్డారు. 63 వేల మంది మరణించారు. ఇరాన్, రుమేనియా దేశాల్లో కరోనా ఉధృతి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
చైనాలో కూడా ఐదు రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. గాన్సు, ఇన్నర్ మంగోలియా, జియాన్ తదితర ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకుతున్నట్లు గుర్తిస్తున్నారు. దీంతో నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు సమాచారం. పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు కూడా నిలిపివేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వ్యాధి తీవ్ర తగ్గేందుకు చర్యలు తీసుకుంటున్నారు.