Morgan Stanley Upgrades India: అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు, భయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంచలన విషయాలు వెల్లడించింది. భారత్ రేటింగ్‌ను మరింత మెరుగు పరిచింది. ఏకంగా ‘ఓవర్ వెయిట్’ గా పేర్కొంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. సంస్కరణల అజెండా మూల ధన వ్యయాలు, లాభాల విషయంలో సానుకూల దృక్పథంతో భారత్ పయనిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ సంస్కరణ, స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది. దీంతో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్ పోలియోలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు, యువ జనాభా మరింత ఉపయోగపడుతున్నాయి. దీర్ఘకాల అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. బలమైన పునాదులు నిర్మించుకుంటోదని’ మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. భారత ఆర్థిక వ్యవస్థ సూచీలు చాలా బలంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం వృద్ధి అంచనాలను అందుకునే దిశగా పయనిస్తోందని పేర్కొన్నది.
మూడో ఆర్థిక వ్యవస్థగా..
ఇటీవల ఎస్‌బీఐ ఆర్థిక వేత్తలు సర్వే నిర్వహించారు. ఇందులో మరో రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పారు. వారు చెప్పనట్టుగానే మోర్గాన్ స్టాన్లీ భారత్ పై మదుపరులు ఆశావహ దృక్పథంతో ఉన్నట్టు వ్యాఖ్యానించడం విశేషం. కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం అతలాకుతలం అయినప్పటికీ భారత్ నిలదొక్కుకుంది. ప్రపంచ పెద్దన్నగా వెలుగొందుతున్న అమెరికా ఆపసోపాలు పడుతోంది. చైనా కూడా బేల చూపులు చూస్తోంది. రష్యా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం వల్ల పెట్టుబడులను ఆకర్షించలేకపోతోంది. కానీ భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉంది. గతంలో అంటే కాంగ్రెస్ పాలనలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. కేవలం తొమ్మిదేళ్లలో నాలుగో స్థానానికి వచ్చింది. మరో రెండేళ్లలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
చైనా ఈక్వల్ వెయిట్
ఇక డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ గురించి మోర్గాన్ స్టాన్లీ పెద్దగా ఆశవాహ దృక్పథంతో మాట్లాడలేదు. ‘అమెరికా పెత్తనానికి గండి కొట్టాలని, తద్వారా తాను ప్రపంచ పెద్దన్నగా ఎదగాలని చైనా అనుకుంటోంది. కానీ అదంతా ఈజీ కాదు. ఆర్థిక మాంద్యం వల్ల ఆర్థిక పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంత గొప్పగా ఏమీ లేదు. అలాంటప్పుడు ముదుపరులు చైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదని’ మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. అందుకే చైనాకు ఈక్వల్ వెయిట్ ఉంటుందని అభిప్రాయపడింది. చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఆశావహ దృక్పథాన్ని ప్రోది చేసుకోలేకపోతోందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొన్నది.