Huzurabad: హుజూరాబాద్ ఎన్నికలు చాలా కాస్లీ అయిపోయాయి. ఇప్పడంతా అక్కడ డబ్బుదే హవా నడుస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓట్లు పడతాయన్నభావన్న రాజకీయ పార్టీల్లో బలంగా వెళ్లిపోయింది. అందుకే ప్రచార పర్వం ముగిసిన తరువాత, ఇక ప్రలోభాల పర్వం మొదలు పెట్టారు. ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అంటూ హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు.. ఇక ఇప్పుడు డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టాయి.

ఓటుకు ఎంత ?
హుజూరాబాద్‌లో ఓటు చాలా ధర పలుకుతోంది. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లో ఓటుకు ఇంత చెల్లించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని కవర్లు వెళ్తున్నాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల ఆధారంగా కవర్‌పై నెంబర్ ఉంటోంది. ఆ ఇంట్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓ నెంబర్ ఉన్న కవర్‌ను ఇస్తున్నారు. అయితే ఒక్క ఓటుకు ఇంత అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. ఆయా మండలం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఓటు విలువ మారిపోతోంది. ఒక చోట ఓటుకు ఆరు వేలు ఇస్తే, మరో చోట 10 వేలు ఇస్తున్నారు. ఇంకో చోట 12 వేలు కూడా ఇస్తున్నారు. ఈ లెక్కన ఇంట్లో మూడు, నాలుగు ఓట్లు ఉండే 24 నుంచి 48 వేల మధ్య చేరుతున్నాయి. ఇలా డబ్బుల పంపిణీకి సంబంధించిన వీడియోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కవర్లపై నెంబర్లు రాసి ఉండటం, దానిని ఓటర్లు ఓపెన్ చేయడం, తరువాత అందులో నుంచి డబ్బులు తీయడం వంటివన్నీ ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డబ్బులిస్తాం.. ఓటేస్తామని ఒట్టేయండి..
హుజూరాబాద్ ఎన్నికల్లో రాత్రి రాత్రే సమీకరణలు మారిపోతున్నాయి. రోజు రోజుకు గెలుపోటముల అవకాశాలు తారుమారు అవుతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ తగ్గేదేలేదంటున్నాయి. ఆరు నూరైనా ఇక్కడ గెలిచే తీరాలన్న కసితో పని చేస్తున్నాయి. హుజూరాబాద్‌లో 5 నెలల ముందే ఈ కార్యక్రమం మొదలైనా చివరి రోజులు ఇది మరింత జోరుగా సాగుతోంది.
మొదట్లో స్థానికేతరులు ఇక్కడ కనిపిస్తే వ్యతిరేకించిన హుజూరాబాద్ వాసులే.. ఇప్పుడు వారిని ఏం అనడం లేదు. అందుకే పార్టీలు కూడా వారినే అక్కడ మోహరించాయి. వారితోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాయి. వార్డు వారీగా, మండలం వారీగా ఇన్‌చార్జీలను నియమించుకున్నాయి. అయితే వారు ఇంటింటికి వెళ్లి ఓటుకు ఇంత చొప్పున డబ్బులు ఇస్తున్నారు. కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓట్టు కూడా వేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల మొబైల్ పేమెంట్స్ యాప్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు.
తమకు తక్కువించ్చారంటూ ఆందోళన..
Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్: ఈ కీలక అంశాలే ఏజెండా.. వరాలుంటాయా??
ఒకే దగ్గర ఓటుకు 6 వేల చొప్పున అందజేసి, అదే ప్రాంతంలో ఓటుకు రూ.5 వేలు అందించడం, నలుగురు ఉన్న ఇంట్లో కేవలం మూడు ఓట్లకే డబ్బులు అందడంతో ఓ చోట ఆందోళన మొదలైంది. అలా ఎందుకు తక్కువిస్తున్నారంటూ ఓ సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది ఎక్కడ జరిగింది, ఏ పార్టీ వాళ్లు అలా చేశారు అనే విషయంలో స్పష్టత లేదు. అన్ని పార్టీల నుంచి నుంచి డబ్బులు తీసుకుంటున్న ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో, ఎవరికి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారో తెలియాలంటే నవంబర్ 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Petrol Price: పెట్రోల్ రేట్లు పెరగకుండా ఉండనంటున్నాయ్.. మళ్లీ 35 పైసలు..