
Huzurabad: హుజూరాబాద్ ఎన్నికల గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మొదటి నుంచీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం సాగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికకు 72 గంటల ముందు సభలు, సమావేశాలు, ప్రచారం వంటివి నిర్వహించకూడదు. అందుకే నిన్న రాత్రితో ప్రచార పర్వానికి తెరపడింది. ఇక తెరవెనక సాగే ప్రయత్నాలు, ప్రలోభాలు కొనసాగడం చాలా రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యాయి. అయితే నిన్న రాత్రి నుంచి ఆ ప్రయత్నాలు మరింత జోరందుకున్నాయి.
బహుమతులుగా కార్లు, డబ్బులు, పదవులు..
హుజూరాబాద్(Huzurabad) ఎమ్మెల్యే స్థానం కాళీ అయిన నుంచి అక్కడ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ చాలా విస్తృతంగా ఊరూరా తిరిగాయి. పల్లె పల్లెకు వెళ్లి, గడప గడపను పలకరించాయి. హుజూరాబాద్ లో గెలుపే ధ్యేయంగా పని చేశాయి. దీని కోసం కుల సంఘాలను, యువజన సంఘాలను, లోకల్ నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఆ వ్యక్తికి ఉన్న పలుకుబడిని బట్టి, ఆ వ్యక్తి అవసరాన్ని బట్టి అతనికి కావలసినవి ఇచ్చేశాయి. ఇందులో భాగంగా కొందరికి కార్లు ఇస్తే మరి కొందరికి ప్లాట్ లు, మరి కొందరికి భూములు అందజేశాయి. మరి కొందరికి పదవులు అందజేస్తామని హామీలు ఇచ్చుకున్నాయి ఇరు పార్టీలు. కుల సంఘాలకు ఇంత చెప్పున ముట్టచెప్పాయి. ఓటుకు ఇంత చొప్పున లెక్కకట్టి ఇచ్చాయి.
అందినకాడికి లాక్కుంటున్న ఓటర్లు..
ఈ పార్టీల అవసరాన్న ఓటర్లు కూడా బాగానే అర్థం చేసుకున్నారు. రెండు పార్టీల దగ్గర నుంచి అందినకాడికి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు వచ్చి ఏం ఇచ్చినా తీసుకుంటున్నారు. ఆ పార్టీకే ఓటు వేస్తామని చెపుతున్నారు. ఇలా అన్ని పార్టీల నుంచి వచ్చిన బహుమతులను స్వీకరిస్తున్నారు. గత 5 నెలలుగా హుజూరాబాద్‌లో ఇదే కొనసాగుతోంది. కానీ ఇంతలా డబ్బు పంచుతున్న నాయకులు వాటిని తిరిగి తమ నుంచే వసూలు చేసుకుంటారనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
కవర్ లో డబ్బులు పంచుతున్న వీడియో వైరల్..
హుజూరాబాద్‌లో ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు పోల్ మేనేజ్ మెంట్‌లో భాగంగా ప్రలోభాల పర్వం మొదలయ్యింది. ఓటుకు ఇంత చొప్పున అని లెక్క గట్టి డబ్బులు పంచుతున్నారు. దీనికి సంబంధిచిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మొహం కనిపించకుండా కేవలం మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. కవర్ పై ఒకటి అని రాసింటే ఒక ఓటని చెబుతూ.. ఆ కవర్ ను ఓపెన్ చేశాడు. అందులో నుంచి ఆరు వేల రూపాయిలు కౌంట్ చేసి, ఓటుకు ఆరు వేలని చెబుతున్నాడు. ఇది ఓ పార్టీకి చెందినదని, అతనికే ఓటు వేయాలని సూచిస్తున్నాడు. మరి అది నిజంగా డబ్బులు పంచుతున్నప్పుడు తీసిందా లేక ఆ ప్రత్యర్థి పార్టీని ఇరకాటంలో పెట్టాలని కావాలనే తీసిన వీడియోనా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఇప్పటికే డబ్బులు ఓటర్ల చేతిల్లోకి చేరిపోయాయి. రాబోయే రెండు రోజుల్లో మరింతగా పంపిణీ జరిగే అవకాశం లేకపోలేదు.