Mohan Babu 49 Years : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది సెపరేట్ రూట్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేకమైన శైలి. భయం ఎరుగని మనిషి, ఎవరికీ లొంగని మనస్తత్వం. తెలియని వారికి భీకరుడు, కొంచం తెలిసిన వారికి ముక్కుసూటి మనిషి, బాగా తెలిసిన వారికి మంచి మనసున్న వ్యక్తి. తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి లాంటి డైలాగులు చెబితే ఆయనే చెప్పాలి ఆయనే కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ పద్మశ్రీ డా.మోహన్ బాబు. ‘అసెంబ్లీ రౌడీ’గా మాస్ ప్రేక్షకులను మెప్పించినా… ‘అల్లుడుగారు’గా క్లాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది మాత్రం ఆయనే. నలభై ఐదేళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో మొదలైన నటప్రపూర్ణ నట జీవితం ఇప్పటికీ స్వర్గం నరకం లాంటి ఎన్నో ఎత్తుపల్లాలతో కొనసాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నేటితో 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నటుడిగా 500కు పైగా సినిమాలు, నిర్మాతగా 50కి పైగా సినిమాలు చేసిన రికార్డు ఆయన సొంతం. ‘నా రూటే సపరేటు’ అంటూ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ లాగానే విలనీ, మ్యానరిజం, హీరోయిజం అన్నీ మేళవించిన విలక్షణ నటుడు మోహన్ బాబు.
మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. తన సినీ జీవితానికి బాటలు వేసిన తొలి గురువు దాసరి నారాయణరావు. తన పేరును తర్వాత మోహన్ బాబుగా మార్చుకున్నారు. దర్శక రత్న డా.దాసరి నారాయణరావు శిష్యుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు.. 1975లో నటుడిగా అరంగేట్రం చేసిన తర్వాత దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన “స్వర్గం నరకం” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత ఆయన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించాడు. స్వర్గం నరకం సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు 520కి పైగా సినిమాల్లో నటించి, 181 సినిమాల్లో హీరోగా నటించి బాక్సాఫీసు బ్లాక్ బస్టర్లను అందించారు.
ఆయన హీరోగా నటించిన అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం సినిమాలు మోహన్ బాబును హీరోగా తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ చిత్రాలతో కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. శ్రీరాములయ్య, అడివిలో అన్న సినిమాలతో తనలోని మరో నటుడిని చూపించాడు మోహన్ బాబు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్ గా నిలిచిపోయారు. అటు తర్వాత ఆయన నిర్మాతగా కూడా మారాడు. “శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్” స్థాపించాడు. 50 కి పైగా చిత్రాలను నిర్మించి, ఆయనను విజయవంతమైన నిర్మాతగా తనను తాను మార్చుకున్నాడు. విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు.
ఆత్రేయ గారు అన్నట్లు అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ అన్నారు అది అక్షర సత్యం. మోహన్ బాబు గారు తన మొత్తం 49 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు, విజయాలు, అపజయాలను చూశారు. భగవంతునిపై గట్టి నమ్మకం ఉన్న సాయిబాబా భక్తుడు. పాపం, పుణ్యం, స్వర్గం, నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయని మోహన్ బాబు నమ్మారు. ఆయన కళాత్మక ప్రతిభకు పద్మశ్రీ కూడా లభించింది. తిరుపతికి 14 కి.మీ దూరంలోని రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానాన్ని చూరగొన్న ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో తన తనయుడు విష్ణుతో కలిసి కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు.