https://oktelugu.com/

Narendra Modi: కాంగ్రెస్ తప్పులు సరే.. అధికారంలో ఉండి మీరు చేసిందేమిటి..? మోదీకి పలు ప్రశ్నలు 

Narendra Modi: అవ్వా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్టుగా మారింది కేంద్రంలోని బీజేపీ పరిస్థితి.. మోడీ సర్కార్ రాష్ట్రాలకు ఇచ్చింది పెద్దగా ఏమీ లేదని ఆయా సీఎంలు బోరుమంటున్నారు. పోనీ బయట అడుక్కుందామన్నా ‘ఎఫ్ఆర్ బీఎం’ సహా సవాలక్ష కండీషన్లు పెట్టి అప్పు కూడా పుట్టనివ్వడం లేదని ఏపీ సీఎం సహా అప్పల్లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోలోపల కుమిలిపోతున్నారు. మోడీ వచ్చాక తెలంగాణనుంచి నిధులు పోవడం తప్పితే రావడం లేదని మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ లాంటి వారు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2022 / 09:23 AM IST
    Follow us on

    Narendra Modi: అవ్వా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్టుగా మారింది కేంద్రంలోని బీజేపీ పరిస్థితి.. మోడీ సర్కార్ రాష్ట్రాలకు ఇచ్చింది పెద్దగా ఏమీ లేదని ఆయా సీఎంలు బోరుమంటున్నారు. పోనీ బయట అడుక్కుందామన్నా ‘ఎఫ్ఆర్ బీఎం’ సహా సవాలక్ష కండీషన్లు పెట్టి అప్పు కూడా పుట్టనివ్వడం లేదని ఏపీ సీఎం సహా అప్పల్లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోలోపల కుమిలిపోతున్నారు. మోడీ వచ్చాక తెలంగాణనుంచి నిధులు పోవడం తప్పితే రావడం లేదని మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ లాంటి వారు లెక్కలతో ఎండగట్టారు. మరి తాజాగా పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాల పట్ల కాంగ్రెస్ తప్పులను ఏకరువు పెట్టిన మోడీ సార్.. మరి బీజేపీ సర్కార్ లో తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారని వెనక్కి చూస్తే.. చెప్పుకోవడానికి ఏమీ లేదట..

    తెలంగాణకు విభజన హామీల్లో ప్రకటించిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అతీగతీ లేకుండా పోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీ కారిడార్ అసలు ఊసే లేకుండా పోయింది. ఎన్ని హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇవ్వను పో అంటోంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని మరీ మోడీ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల సాక్షిగా గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తానని అన్నాడు.. ఆ హామీ ఇప్పటికీ ఎండమావిగానే మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తప్పులు లెంకిన మోడీని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నేతలు ‘మీరు అధికారంలో ఉండి చేసిందేంటి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

    పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన మంత్రి మోదీ తాజాగా కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. అయన అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీపై ఇంతలా విరుచుకుపడడం చూసి మిగతా పార్టీలకు సైతం ఆశ్చర్యం కలగక మానలేదు. అయితే మోదీ చేసిన విమర్శలపై ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే తప్పంతా కాంగ్రెస్ దే అంటున్నమోదీ.. తన తప్పేం లేదన్నట్లు ప్రసంగించారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతోంది. మరి ఈ ఏడేళ్లలో ఆయన ఒరగబెట్టిందేమిటి..? అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి మోదీ.. కాంగ్రెస్ పై అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. విభజన చట్టాలను పట్టించుకోకుండా ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు, మైకులు బంద్ చేసి విభజన బిల్లును ఆమోదించారని అన్నారు. రాష్ట్ర విభిజనపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించలేదని, కానీ ఏర్పాటు చేసే పద్దతి ఇదేనా..? అని విమర్శలు చేశారు.

    అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్ సరైన పద్ధతులు పాటించలేదు సరే.. అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ను రెండు రాష్ట్రాల్లో మట్టుపెట్టారు. మళ్లీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే కేంద్రంలో ఏడేళ్లు అధికారంలో ఉన్న మోదీ విభజన సమస్యలను ఎలా పరిష్కరించారని ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి అధికారంలో ఉంటున్న మోదీ తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణతో పాటు విభజన సందర్భంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కూడా ఏ విధంగా న్యాయం చేయలేదు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలియదా..? అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదీ ఇవ్వాలన్న ప్రజల డిమాండ్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు…? నీతి అయోగ్ పేరిట హోదా ఇక కష్టసాధ్యమని తేల్చేశారు. బీజేపీ బలం లేకపోవడం.. దక్షిణాది రాష్ట్రాలు కావడంతోనే తెలంగాణ, ఏపీకి నిధులు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ‘‘విభజన సందర్భంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి రాజధానిని నిర్మించేందుకు నిధులు సమకూర్చే బాధ్యత కేంద్రానిది కాదా..? ఏపీకి జరిగిన అన్యాయం మోదీకి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి మెజారిటీతో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి పెద్ద కష్టమేమి కాదు. కానీ అయినా ఆయన అన్యాయం చేయడం లేదా..? రెండు రాష్ట్రాలను విభజించే తీరు సరిగా లేదని విమర్శిస్తున్న మోదీ ఇప్పుడు అధికారంలో ఉన్న మోది వాటిని ఆదుకొని నిరూపించాలి కదా..?’’ అని అంటున్నారు.

    తెలంగాణ విభజన తీరుతో తమకు తీవ్రంగా నష్టం జరిగిందని తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని పక్కనబెట్టాయి. మళ్లీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలియదు. అలాంటప్పుడు చచ్చిన కాంగ్రెస్ ను మళ్లీ మళ్లీ ఎందుకు చంపుతారు..? ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దే బాధ్యతను బీజేపీకి దేశంలో రెండు సార్లు గెలిపించి అప్పగించారు. అలాంటప్పుడు ఇన్నేళ్లలో ఏం చేసినట్లు..? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. సరే.. ఏపీకి మిగతా విషయాల్లో పట్టించుకోకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఎందుకంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు..? అని అంటున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీని విమర్శలు చేయడం మాని ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీకి..ఆ పార్టీ ప్రధాని నరేంద్రమోడీకి రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.