
చైనాకు సంబంధించిన 59 మొబైల్ ఫోన్ యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ లో భాగస్వామ్యం అయ్యేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టవలసిందిగా ప్రధాని మోడీ ఐటి రంగానికి చెందిన నిపుణులకు పిలునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం నూతన ఆవిష్కరణలకు పూనుకుందాం శీర్షికతో శనివారం ప్రధాని మోడీ సోషల్ మీడియా లో రాసిన ఒక పోస్ట్ లో ఆత్మనిర్భర్ భారత్ సృష్టిలో భాగంగా కొత్త యాప్ లను రూపొందించే సవాలులో పాలుపంచుకుని తమ సత్తా చాటాలని మన దేశానికి ఐటి నిపుణులను కోరారు.
ఇటువంటి యాప్ లకు భారతదేశంలో గల విస్తృతమైన మార్కెట్ సామర్ధాన్ని ఉపయోగించుకోవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. మన మార్కెట్ సామర్ధం, మార్కెట్ అవసరాలను సంతృప్తి పరచగల ప్రాడక్ట్‌లు(యాప్ లు) రూపొందించడం వల్ల సాధించగల ప్రయోజనాలు మనకు తెలుసునని ఆయన అన్నారు. గృహావసరాలకు ఉపయోగపడే ఇటువంటి యాప్‌లను రూపొందించడానికి ఐటి రంగంలో ఎంత ఆసక్తి ఉందో ఇటీవలి కాలంలో మనమందరం చూస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈరోజు దేశం ఆత్మనిర్భర్ భారత్ ను సృష్టించడానికి యావద్దేశం కృషి చేస్తున్న తరుణంలో మన మార్కెట్‌ను సంతృప్తిపరచడంతోపాటు ప్రపంచంతో పోటీ పడగల యాప్ లను రూపొందించడానికి జరిగే ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ఇదే మంచి అవకాశమని ఆయన అన్నారు.
ఈ లక్ష్యాలను సాధించడంలో అంకుర, ఐటి కంపెనీలకు తోడ్పడేందుకు కేంద్ర ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో కలసి ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను చేపడుతోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న యాప్ లను ప్రోత్సహించడం, కొత్త యాప్ లను రూపొందించడం అనే రెండు విభాగాలు ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. మొదటి విభాగంలో ఇప్పటికే ఉన్న యాప్ లకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో ఇ-లర్నింగ్, వర్క్-ఫ్రమ్-హోమ్, గేమింగ్, బిజినెస్, ఎంటర్‌టైన్ మెంట్, ఆఫీస్ యుటిలిటీస్, సోషల్ నెట్‌వర్కింగ్ వంటివి ఉంటాయని ఆయన చెప్పారు. వీటిలో నాణ్యమైన యాప్ లను గుర్తించి వాటికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం నెలరోజుల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు.
ఇక కొత్త యాప్ ల రూపకల్పనకు ప్రభుత్వ పరమైన ప్రోత్సాహం రెండో విభాగంలో జరుగుతుందని ఆయన చెప్పారు. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త యాప్‌ల అవసరంఎంతో ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారతీయ సనాతన క్రీడలను కొత్త యాప్‌ల ద్వారా ప్రజలకు చేరువ చేయగలమో లేదో ఆలోచించాలని ఆయన సూచించారు. ఆయా వయసుల వారికి అనుగుణంగా వారికి ఉపయోగపడే రీతిలో ఆటలు, విజ్ఞానం అందించగలమో లేదో కూడా యోచించాలని ఆయన పేర్కొన్నారు. పునరావసంలో ఉన్న వారికి లేదా కౌన్సెలింగ్ పొందుతున్నవారికి ఉపయోగపడే క్రీడా యాప్‌లను రూపొందించే విషయాన్ని కూడా ఆలోచించాలని ఆయన చెప్పారు. ఇటువంటి చాలా ఆలోచనలు చేయవచ్చని, దీనికి సాంకేతికత ఒక్కటే పరిష్కారం అందివ్వగలదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.