MLC Kavitha- Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అరెస్ట్‌పై నాలుగు రోజులుగా మీడియాలో ప్రధాన వార్తల్లో ఒకటి అవుతోంది. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి అనుచరులు, బీఆర్‌ఎస్ నాయకులే తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడిచేశారు. ఈ సందర్భంగా ఒకరిని క్యూ న్యూస్ సిబ్బంది పట్టుకుని దాడిచేశారు. దాడికి సబంధించి మల్లన్న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లన్న అరెస్ట్‌ను కొంత మంది ఖండిస్తుండగా, మరికొంతమంది సమర్థిస్తున్నారు. జర్నలిస్టును అని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని పేర్కొంటన్నారు. దాని ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
జర్నలిస్టునని ఏది పడితే అది మాట్లాడితే..
తీన్మార్ మల్లన్న అరెస్టును చాలామంది ఖండిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లోని కొంత మంది కూడా మల్లన్నకు ఇంటర్నల్‌గా మద్దతు తెలుపుతున్నారు. కానీ, తీన్మార్ మల్లన్న తప్పులు కూడా ఉన్నాయన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. తన వాక్‌చాతుర్యంతో లక్షల మంది సబ్‌స్క్రైబర్‌ను సంపాదించుకున్న క్యూ న్యూస్ ద్వారా మళ్లన్న నిత్యం వార్తలు ప్రసారం చేస్తున్నారు. అయితే జర్నలిస్టును అని, ఏది పడితే అది మాట్లాడడం మల్లన్నకు అలవాటుగా మారిపోయింది. గతంలో ఒకసారి అరెస్ట్ అయిన బీజేపీ సహకారంతో బయటకు వచ్చాడు. కేసీఆర్‌ను ఇక తిట్టను అని మల్లన్నే ప్రకటించారు. కానీ, పాత పంథాలోనే తన వార్తలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎందుర్కొంటున్నారు. ఈ సందర్భంగా క్యూ న్యూస్‌లో కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కవిత ఫొటోలను కూడా మార్ఫింగ్ చేయించి ప్రదర్శించారు. ‘కొంగు నడుముకు చుట్టవే కవితక్క.. లిక్కర్లు చేపట్టవే కవితక్క’ అంటూ లైవ్‌లో కవితపై సెటైర్‌గా పాటపాడారు. అంతకు ముందు ఏం పాదం.. లిక్కర్ పాదం అంటూ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలా విచారణ సందర్భంగా పక్షం రోజులుగా సెటైర్లు వేస్తూ వస్తున్నారు. ఈ సెటైర్లు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.
అందుకే అరెస్ట్..
మహిళ అని కూడా చూడకుండా కవితపై ఇష్టానుసారం మాట్లాడడంపై కొన్నివర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సారా రాణి, లిక్కర్ రాణి అంటూ మాట్లాడడం.. ఇతరులతో పోల్చడం, జైలుకు వెళ్లడం ఖాయం అని పేర్కొనడం బీఆర్‌ఎస్ నేతలకు మింగుడు పడలేదు. ముఖ్యంగా కవిత సోదరుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయాలు వెళ్లడంతో మల్లన్న నోరు మూయించాలని ఇంటర్నల్‌గా పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు మొదట దాడిచేసి, తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
ఆఫీస్‌పై దాడిచేసినవారిని ఏమీ అనకుండా..
క్యూ న్యూస్ కార్యాలయంపై దాడిచేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు.. తనపై దాడి చేశాడని పట్టుబడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నను పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సంచలనమైంది. నోటీసులు ఇవ్వకుండా మఫ్టీలో వచ్చి లాక్కెళ్లడం, క్యూన్యూస్ ఆఫీస్‌ను పోలీసులు అధీనంలోకి తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు మల్లన్న భార్య తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. చివరకు గవర్నర్ తమిళిసైని కూడా కలిసింది. మొత్తంగా మల్లన్న తీరులోనూ తప్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.