
Kavitha- ED: ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకల్లోతు కష్టాల్లో ఎమ్మెల్సీ కవిత కూరుకుపోయింది. ఇప్పటికే ఒకసారి సిబిఐ, రెండుసార్లు ఈడీ అధికారుల విచారణకు హాజరైంది. మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు మళ్ళీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కవితను కచ్చితంగా అరెస్టు చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రగతి భవన్ వర్గాలు కూడా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇదంతా ఒక కోణం. కానీ గులాబీ మీడియా మాత్రం కవితను వెనకేసుకొస్తోంది.
ఈడి అధికారులను కవిత ఒక ఆట ఆడుకున్నట్టు ప్రచారం చేస్తోంది. అధికార కరపత్రికలో ఈరోజు ఎడిషన్లో ముప్పావు వంతు ఈ వార్తలకే ప్రాధాన్యమిచ్చింది. కవిత ను దర్యాప్తు సంస్థ విచారించడం కాదు, ఆ సంస్థను తమ నాయకురాలు ప్రశ్నలతో నిలదీసినట్టు సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. మంగళవారం మరోసారి విచారణకు కవిత హాజరుకానున్న నేపథ్యంలో నిన్న ఏం జరిగిందో పింక్ మీడియా కొన్ని విషయాలను తెరపైకి తీసుకువచ్చింది. ఈడీ, కవిత మధ్య విచారణ ఎలా సాగింది? ఎవరు ఎవరిని ప్రశ్నించారు? అంటూ రాస్కొచ్చింది. కవిత ప్రశ్నలకు దర్యాప్తు సంస్థ అధికారులు నీళ్లు నమిలారని, వారిపై కవిత ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు దర్యాప్తు సంస్థ అధికారులను కవిత ఎలాంటి ప్రశ్నలు అడిగిందో కూడా తెలంగాణ అధికార పార్టీ వివరాలు వెల్లడించడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది.
” తనను నిందితురాలుగా విచారిస్తున్నారా? లేక అనుమానితురాలిగానా? ఈ విషయాల మీద ఒక స్పష్టత ఇవ్వండి. ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా తన మద్యం విధానాన్ని మార్చుకుంటే దాంతో నాకేంటి సంబంధం? రాజకీయ కక్షతో మీరు ఇలా ఎంతమందిని విచారణ పిలుస్తారు. హిమంత బిశ్వ శర్మ, నారాయణ రాణే, సుజనా చౌదరి పై గతంలో మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయి? బిజెపిలో వారంతా చేరగానే ఎందుకు విచారణ ఆగింది” అని ఇలాంటి ప్రశ్నలతో దర్యాప్తు సంస్థ అధికారులను కవిత ఉక్కిరి బిక్కిరి చేసుకొచ్చిందని పింక్ మీడియా రాస్కొచ్చింది.

” విచారణ పేరుతో పిలిచి గంటల తరబడి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడి చేస్తే లొంగిపోతామనుకుంటున్నారా? విచారణలో అసలు పారదర్శకత, నిజాయితీ ఎక్కడ ఉన్నాయి? రాజకీయ కుట్రలో మీ సంస్థ భాగస్వామి అవుతోందనే అనుమానం కలుగుతున్నది.” అని దర్యాప్తు సంస్థ అధికారులను కవిత నిలదీసినట్టు, నిగ్గదీసినట్టు పింక్ మీడియా స్తుతి కీర్తనలు ఆలపించింది.
మరోవైపు విచారణలో జరగని విషయాలను జరిగినట్టుగా లీక్ చేస్తుండటంపై ఈడీ అధికారులపై కవిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు భారత రాష్ట్ర సమితి చెబుతోంది. తన కేసుపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, తనను పిలవాల్సిన తొందర ఏమిటని దర్యాప్తు సంస్థల అధికారులను కవిత ప్రశ్నించినట్టు గులాబీ పార్టీ చెప్పుకొస్తోంది.. అంతేకాదు కవిత ప్రశ్నలకు దర్యాప్తు సంస్థ అధికారులు నీళ్లు నమిలారని పింక్ మీడియా డబ్బాలు కొడుతోంది.