Undavalli Sridevi: ఏ ఎండకు ఆ గొడుగు.. ఉండవల్లి శ్రీదేవి ని చూస్తే ఈ సామెత కూడా ఇప్పుడు చిన్నబోతుంది కావచ్చు.. శాసనసభ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిందన్న నెపంతో వైఎస్ఆర్సిపి ఆమెను సస్పెండ్ చేసింది. ఆమె క్యాంప్ కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడి చేశారు.. దీంతో ఆమె రెచ్చిపోయింది.. తన గుండె లబ్ డబ్ అని కాకుండా జగన్ జగన్ అని కొట్టుకుంటుందని నిండు శాసనసభలో చెప్పిన శ్రీదేవి..జగన్ ఆంధ్రా పాలిట విలన్ అని అనేసింది. మొన్నటిదాకా తన బలం బలగం అని చెప్పుకున్న కార్యకర్తలను గుండాలు అని సంబోధించింది.
వాస్తవానికి ఎక్కడ చేరిందో గానీ తాడేపల్లి కి శ్రీదేవి దూరమై చాలా రోజులైంది.. పైగా ఆ మధ్య పీకే టీం చేసిన సర్వేలో శ్రీదేవి ఓడిపోతుందని స్పష్టమైన సంకేతాలు రావడంతో అధిష్టానం ఆమెను దూరం పెట్టింది. ఉండవల్లి శ్రీదేవి పక్కా పొలిటిషన్ కాబట్టి ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. పైగా టిడిపి నుంచి ఇంటర్నల్ గా సపోర్ట్ తగ్గడంతో క్రాస్ ఓటింగ్ దర్జాగా వేసింది. వైఎస్ఆర్సిపి నుంచి సస్పెండ్ అవుతానని ముందే ఊహించింది. అలా జరిగిన తర్వాత మంగళగిరి స్క్రిప్ట్ చదివేసింది.
ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన తర్వాత స్మశానం ముందు ముగ్గు, రాజకీయ నాయకులకు సిగ్గు ఉండవనేది మరోసారి నిరూపించింది.. నడు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన శ్రీదేవి.. నేడు అదే అమరావతి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పడం విశేషం.. నాడు ఏ మేకప్ కిట్లు వేసుకుని ఉద్యమం చేస్తున్నారని దూషించిందో.. నేడు అదే మేకప్ కిట్ కరిగేంతగా కన్నీరు పెట్టడం గమనార్హం.. నాడు ఏ జగన్మోహన్ రెడ్డిని దేవుడు కొనియాడిందో.. నేడు అదే జగన్మోహన్ రెడ్డిని విలన్ అనేసింది.
మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడిన శ్రీదేవి.. ఢిల్లీలో చదువుతున్న తన కుమార్తెను రాజధాని ఏదని తన స్నేహితులు అడిగితే.. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదట.. ఇవే కాదు ఎన్నో ఆణిముత్యాలు ఆమె నోటి నుంచి జాలు వారాయి. ఒకప్పుడు ఆమె మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు పరిశీలించి చూస్తుంటే.. రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటాయా, పదవుల కోసం నాయకులు ఎంతకైనా దిగజారతారా అనిపిస్తున్నది. ఉండవల్లి శ్రీదేవి మాత్రమే కాదు ఇలాంటివారు ఎంతోమంది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. డబ్బు అనేది నడిపిస్తున్నప్పుడు, పార్టీలకు అదే జవ సత్వం అయినప్పుడు ఇలాంటి వారు కాక… మరి ఎలాంటి వారు వస్తారు? ఇలాంటి వారికి ఓటు వేయడం ప్రజల ఖర్మ! అంతే..అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు.