https://oktelugu.com/

Telangana Congress: జంపింగ్‌ లకు టికెట్లు.. ఆశావహులకు మొండి‘చేయి’.. ఇది కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం!

అడవుల జిల్లా ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లోనూ అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ నాయకుడు గండ్రత్‌ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ టికెట్‌ ఆశించారు.

Written By: , Updated On : October 28, 2023 / 02:01 PM IST
Telangana Congress

Telangana Congress

Follow us on

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఈనెల 15న మొదటి లిస్ట్‌ ప్రకటన తర్వాత ముగ్గురు నలుగురు మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కురువ విజయ్‌కుమార్‌ రేవంత్‌రెడ్డి ఏకంగా టికెట్లు అమ్ముకున్నాడని ప్రచారం చేశారు. ఆందోళనకు దిగారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, ఈడీకి ఫిర్యాదు చేశారు. విజయ్‌కుమార్‌ గద్వాల నుంచి టికెట్‌ ఆశించారు. కానీ మొదటి లిస్ట్‌లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. ఈ పంచాయితీ పూర్తిగా సద్దుమణగక ముందే కాంగ్రెస్‌ 45 మందితో రెండో జాబితా రిలీజ్‌ చేసింది. ఈ జాబితాలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యం దక్కింది. 20 మంది ప్యారాచూట్లకు టికెట్లు దక్కాయి. దీంతో పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న నేతల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. చాలా మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గెలిచే వకాశం ఉన్నవారికి టికెట్లు ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నా… పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడంపై ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి దారి వారు చూసుకునే పనిలో మంతనాలు మొదలు పెట్టారు.

ముదిరాజ్‌కు పటాన్‌చెరు టికెట్‌..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పటాన్‌చెరు టికెట్‌ రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు దక్కింది. ఈయన బీఆర్‌ఎస్‌లో పనిచేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కానీ, కేసీఆర్‌ ప్రకటించిన టిక్కెట్లలో నీలం మధుకు టికెట్‌ రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేటీఆర్‌పై విశ్వాసంతో రెండు నెలలు పార్టీలోనే కొనసాగారు. కానీ చివరకు టికెట్‌ రాదని తెలుసుకుని కాంగ్రెస్‌ తలుపు తట్టారు. హస్తం పార్టీ కూడా నీల మధును సాదరంగా ఆహ్వానించి అక్కడ కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కాట శ్రీనివాస్‌గౌడ్‌ను కాదని మధుకు రెండో జాబితాలో టికెట్‌ ఇచ్చింది. దీంతో కాటా శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను ఒప్పించేందకు కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శ్రీనివాస్‌గౌడ్‌ శాంతించనట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌లో..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మరో నియోజకవర్గం జూబ్లీహిల్స్‌. కాంగ్రెస్‌ సీనియరక్‌ నాయకుడు దివంత పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి చాలాకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు. కానీ, ఇక్కడ కాంగ్రెస్‌ అనూహ్యంగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు టికెట్‌ ఇచ్చింది. మొదటి నుంచి అజారుద్దీన్‌ జూబ్లీహిల్స్‌పై దృష్టిపెట్టారు. అయినా విష్ణువర్దన్‌ టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో పనిచేశారు. అయితే ఇక్కడ మైనారిటీలు ఉన్నారని కాంగ్రెస్‌ అజారుద్దీన్‌వైపు మొగ్గు చూపింది. దీంతో విష్ణువర్దన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

మునుగోడు..
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు టికెట్‌ అనూహ్యంగా ఒక్కరోజు ముందు కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని వరించింది. ఇక్కడి నుంచి గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియన్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. నాడు చలమల కృష్ణారెడ్డి కూడా టికెట్‌ ఆశించినా కాంగ్రెస్‌ నాయకత్వం నచ్చజెప్పింది. ఈసారైనా తనకు టికెట్‌ వస్తుందని కృష్ణారెడ్డి ఆశించారు. కానీ అధిష్టానం అనూహ్యంగా కాంగ్రెస్‌ను వీడి, తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వతంత్రంగా అయినా ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కృష్ణారెడ్డి ప్రకటించారు.

ఆదిలాబాద్‌..
అడవుల జిల్లా ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లోనూ అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ నాయకుడు గండ్రత్‌ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ టికెట్‌ ఆశించారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం అనూహ్యంగా ఇటీవల పార్టీలో చేరిన కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ ఖరారు చేసింది. దీంతో ఆశవహులతోపాటు క్యాడర్‌లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదట సుజాత, సాజిద్‌ఖాన్‌ మధ్య టికెట్‌ పంచాయితీ నడిచింది. ఈ ఇద్దరు కొట్టుకుంటుండగా మూడో వ్యక్తి కంది శ్రీనివాస్‌రెడ్డి వచ్చి టికెట్‌ ఎగరేసుకుపోయారు.

ఆసిఫాబాద్‌..
ఇక ఆసిఫాబాద్‌ టికెట్‌ను పార్టీ నాయకురాలు ముర్సుకోల సరస్వతి ఆశించారు. జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమె ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో బలం పెంచుకుంటూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఇటీవల పార్టీలో చేసిన రాథోడ్‌ శ్యాం నాయక్‌కు అధిష్టానం టికెట్‌ ప్రకటించింది. దీంతో సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుంటానని అల్టిమేటం జారీ చేశారు.

ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌..
నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో రవీందర్‌రెడ్డి హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. దాదాపు మూడేళ్లు బీజేపీలో పనిచేశారు. కానీ బీజేపీ బలహీనపడడంతో ఆయన కాంగ్రెస్‌ నుంచి వచ్చిన పిలుపుతో హస్తం గూటికి చేరారు. రెండో జాబితా ప్రకటనకు ఒకరోజు మందు కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు ఎల్లారెడ్డి టికెట్‌ ఇచ్చారు. ఇక నిజాబాబాద్‌ రూరల్‌ టికెట్‌ ఆశించిన సుభాష్‌రెడ్డిని కాదని కాంగ్రెస్‌ అధిష్టానం ఇటీవల పార్టీలో చేరిన మదన్‌మోహన్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో పార్టీకోసం పనిచేసిన సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

పరకాల..
వరంగల్‌ జిల్లా పరకాల టికెట్‌ను కాంగ్రెస్‌ వారం క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించింది. దీంతో మొదటి నుంచి ఇక్కడ తానే కాంగ్రెస్‌ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నా ఇనుగాల వెంకట్రామిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను కూడా బరిలో ఉంటానని హెచ్చరించారు.

అనేక మంది అసంతృప్తులు..
టికట్‌ రానివారిలో సీనియర్‌ నాయకులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌ ఉన్నారు. వీరితోపాటు కొండా సురేఖ కూడా అసంతృప్తితో ఉన్నారు. కొండా మురళికి టికెట్‌ వస్తుందని భావించినా సురేఖకు మాత్రమే టికెట్‌ వచ్చింది. దీంతో ఆమె కూడా సంతృప్తిగా లేరు. ఇలా అనేక మంది ఆశవహులు నిరాశలో ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీవైపు కొంతమంది చూస్తున్నారు. టికెట్‌ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.