MLAs Purchase Case- CBI: తాను ఒకటి తలిస్తే.. హైకోర్టు ఒకటి తలచింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి చేరింది.. ఇప్పటికే దీనిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తవ్వుతోంది.. దీంతో కెసిఆర్ కు తల బొప్పి కట్టింది. ఇది అతడు ఊహించని పరిణామం.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి మింగుడు పడని వ్యవహారం.

అప్పట్లో సుదీర్ఘ ప్రెస్ మీట్
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ మొయినాబాద్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది.. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి ప్రైమ్ అవర్స్ లో ఎక్కువగా టెలికాస్ట్ కావాలని సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడు.. ప్రగతి భవన్ కు వచ్చిన విలేకరులకు డిన్నర్ కూడా ఏర్పాటు చేశాడు.. ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పెన్ డ్రైవ్, ఇతర ఆధారాలు కూడా పంపాడు.. కానీ ఇంతా చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఫాయిదా ఏమీ లేదు.. కెసిఆర్ కు
ఒనగూరిన ప్రయోజనం కూడా లేదు. ప్రభుత్వానికి కోర్టు ఖర్చులు, ప్రత్యేక దర్యాప్తు బృందానికి ప్రయాస, నమస్తే తెలంగాణకు పేజీలకు పేజీల ప్రింటింగ్… అంతే! అంతకుమించి ఊదు కాలింది లేదు.. పీరి లేచింది లేదు.
ఊహించని పరిణామం
ఎప్పుడైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తెరపైకి వచ్చిందో… దీని ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులను ఒక ఆట ఆడుకోవాలని కేసీఆర్ అనుకున్నాడు. ఇలాంటి విషయాల్లో అతడి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన బిజెపి నాయకులు కెసిఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు.. దీంతో ఈ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవి కెసిఆర్ కు మింగుడు పడటం లేదు.. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో భాగంగా సిబిఐ కి హైకోర్టు అనుమతి ఇవ్వడం కేసీఆర్ కు పెద్ద షాక్.. ఇప్పటికే ఈ కేసును ఈడీ కూడా విచారిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. దీన్ని దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. రెండు రోజులపాటు అతనిని విచారించింది. ఈ విచారణలో భాగంగానే బెంగళూరు డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది.. ఇదే నేపథ్యంలో కేసును సైడ్ ట్రాక్ పట్టించేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని భరత రాష్ట్ర సమితి నేతలు ఆరోపిస్తున్నారు.

డిఫెన్స్ లో ప్రభుత్వం
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరుగుతూ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిందని, ఈ వ్యవహారం ఒక ప్రీ ప్లాన్డ్ ట్రాప్ అని ఈ కేసులో నిందితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని, ఆధారాలు నేరుగా ఆయన చేతికి వెళ్ళాయని, అందుకే ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చింది.. ఇది భారత రాష్ట్ర సమితికి, ఆ పార్టీ అధినేతకు మింగుడు పడని పరిణామం.. ఇక ఈ కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేతి నుంచి జారిపోతూ ఉండడంతో.. కోర్టుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు ఏర్పడింది.
ఎందుకు అంచనా వేయలేకపోయారు
పరిణామాలను కెసిఆర్ అంచనా వేయలేకపోయారా? 2015 లో ఓటుకు నోటు కేసు మాదిరి ఎత్తులు వేయలేకపోయారా? అంటే దీనికి సమాధానం అవును అనే వస్తోంది..ఈ కేసుతో బిజెపి నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాం అనుకున్న కేసీఆర్ .. సెల్ఫ్ డిఫెన్స్ లో పడిన పరిస్థితి కనిపిస్తోంది.. ఈ కేసులో మొదట భారత రాష్ట్ర సమితి నాయకులు హడావిడి చేశారు.. అప్పుడు బిజెపి నాయకులు మౌనంగా ఉన్నారు. కానీ తెలివిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇందులో భాగం చేయడంతో..ఇప్పుడు కేసీఆర్ కు ఊపిరి ఆడడం లేదు.