Mission D6: ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అంతకు ముందే పోలీసులు కశ్మీర్‌లో ఇద్దరు డాక్టర్లను అరెస్టు చేశారు. గన్‌తోపాటు 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు జరిగింది. దీంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ అయినవారికి, ఢిల్లీ పేలుడుకు లింకు ఉన్నట్లు తేలింది. ఇక వీరంతా కలిసి మిషన్ ‘‘డీ6’’కు 15 ఏళ్లుగా ప్రణాళిక రూపొందించినట్లు తేలింది. 2010 నుంచి సైలెంట్‌గా స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. వాళ్ల లక్ష్యం 2025 డిసెంబర్ 6న భారత్‌లో ఐదు నగరాల్లో సమన్వయ ఉగ్ర దాడులు జరపడం.
2010లో షాహీన్‌తో మొదలు..
ఈ నెట్‌వర్క్ ఆరంభానికి కారణం షాహీన్ షహీద్ అనే వైద్యురాలు. ఆమె ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసి 2013లో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ మెల్లగా తీవ్రవాద భావజాలానికి లోనైంది. 2015 నాటికి ఆమె మతోన్మాద సిద్ధాంతాలకు ఆకర్షితమై, సమాజంలో నిశ్శబ్దంగా ఆపరేషన్ ప్రారంభించింది. అధికారికంగా రాజీనామా చేసి ఢిల్లీ సమీపంలోని అల్‌ఫలా యూనివర్సిటీకి చేరడం ఈ సంఘటనలకు ఆరంభమైంది. 2015–16 మధ్యలో ఆమె చిన్న గుంపును ఏర్పాటు చేసింది. వైద్యులు, విద్యార్థులు, కొంతమంది సైబర్ నిపుణులు ఈ టీంలో భాగమయ్యారు. వీరంతా అత్యంత బుద్ధిమంతులు, చక్కని ప్రణాళికాధారులు అని ఇంటెలిజెన్స్ పేర్కొంది.
విదేశీ శిక్షణ..
2022లో ఈ గ్రూప్ సభ్యులు తుర్కియేకు ప్రయాణించారు. అక్కడ పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌ను కలిశారు. మాట్లాడారు. దాడులకు ప్లాన్ చేసుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్ సమాచారంతో వ్యూహాలు రూపొందిస్తున్నారు. మద్రసాల ద్వారా డబ్బు, ఆయుధాలు, సాంకేతిక సహాయం అందబడ్డాయి. పాకిస్తాన్ వెళ్లడం అనుమానం రేపుతుందని గ్రూప్ సభ్యులు చెప్పారు కానీ తుర్కియే సురక్షిత ఛానల్‌గా మారింది. హవాలా నెట్‌వర్క్ ద్వారా 20 లక్షల రూపాయలు దేశంలోకి వచ్చాయి. అదే నిధులతో నూవ్, అల్‌ఘర్, కశ్మీర్ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలుచ డిజిటల్ సర్క్యూట్లు సేకరించారు. వీటికి గ్రూప్ అంతర్గతంగా ‘‘మెడిసిన్స్’’ అనే కోడ్ పేరు పెట్టడం గమనార్హం.
వైద్యులతో ఎగ్జిక్యూషన్ టీం..
ఈ గ్రూప్‌లో డాక్టర్ ముజామిల్ లాజిస్టిక్స్ వ్యవహరాలు చూసేవాడు. ఆయుధాలు తెప్పించడం, పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాలు సృష్టించడం అతని బాధ్యత. అదిల్ రెక్కీ నిర్వహించగా, పర్వేజ్ ఫీల్డ్ ఆపరేషన్ల సమన్వయకర్త. డాక్టర్ ఉమర్ మరణం తర్వాత, నెట్‌వర్క్ పర్యవేక్షణ అదిల్ చేతుల్లోకి వెళ్లింది. వీరు అందరూ ‘‘డీ6 మిషన్’’ పేరిట హైదరాబాద్, ఢిల్లీ, జమ్మూకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాని పథకం అమలులోకి రాకముందే ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఈ మొత్తం కుట్రను బహిర్గతం అయింది.
స్లీపర్ సెల్స్ భద్రతకు సవాల్..
15 ఏళ్లుగా స్లీపర్ సెల్స్ ద్వారా యువతను మతోన్మాద భావజాలం వైపు మళ్లించే చర్యలు కొనసాగుతున్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఒక సాధారణ వ్యక్తిని మతపరంగా ప్రభావితం చేసి, ఆ వ్యక్తిలో ఆగ్రహాన్ని రగిలించి, చివరికి ఆయుధ శిక్షణతో ఉగ్రజాలంలోకి లాగడం ఈ నెట్‌వర్క్ పద్ధతి. వైద్యులు, ఇంజినీర్లు, విద్యార్థుల వంటి చదువుకున్న వర్గాల్లో ఈ ప్రాచుర్యం పెరగడం ఆందోళనకరం. డీ–6 మిషన్ భగ్నమవ్వడంతో తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్న ఇంకా జాగ్రత్త చర్యలు అవసరం అని భద్రతావర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా పనిచేసిన స్లీపర్ నెట్‌వర్క్స్ ఇంకా ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు కనిపించని ఈ ప్రొఫెషనల్ టెర్రరిజం మానసిక, సాంకేతిక, ఆర్థిక సమన్వయంతో నడుస్తోంది. ప్రజల్లో అప్రమత్తత, సమాజంలో అనుమానాస్పద చర్యులపై జాగ్రత్తలు ఈ క్రమంలో కీలకమవుతున్నాయి.
డీ–6 మిషన్ విచ్ఛిన్నమవ్వడం భారత భద్రతా వ్యవస్థకు విజయం అయినా, ఉగ్రవాదం రూపాంతరం చెందుతున్న తీరుకు ఇది శ్రద్ధ పెట్టాల్సిన సూచన. మతం పేరుతో జ్ఞానంని ఆయుధంగా మార్చే ఈ సైలెంట్ వార్.. భవిష్యత్తులో మరింత సున్నితమైనపరిస్థితలను సృష్టించవచ్చు. దేశంలో శాంతి, సురక్ష కోసం ప్రజలతో పాటు ప్రతి సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.