
పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్ లో భగ్గుమన్న అసంతృప్తిని చల్లార్చాడు రేవంత్ రెడ్డి. తనను వ్యతిరేకించిన వారి ఇంటికెళ్లి మరీ శాంతపరిచాడు. ఆఖరుకు తనతో పోటీపడ్డ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం కూల్ చేశాడు. మొదటి అంకాన్ని దిగ్విజయంగా పూర్తిచేశాడు.
ఇప్పుడు రెండో అంకంలో టీడీపీ, కాంగ్రెస్, సహా ఇతర పార్టీలో ఉన్న దిగ్గజ నేతలందరినీ కాంగ్రెస్ లో చేర్పిస్తున్నారు. వారిని ఒప్పించి రప్పిస్తున్నారు. ఈ అంకం విజయవంతం అవుతోంది.
ఇప్పుడు మూడో స్టెప్.. అధికార టీఆర్ఎస్ సహా ఎంఐఎంకు ఆయువు పట్టుగా ఉన్న మైనార్టీలను తిరిగి కాంగ్రెస్ కు మళ్లించే ఎత్తుగడను రేవంత్ రెడ్డి చేపట్టారు. దాన్ని విజయవంతం చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మైనార్టీ గర్జన సభ నిర్వహించారు. మైనార్టీలను తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని ఉదాహరణలతో సహా వారిని మెప్పించి ఒప్పించారు.
రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ నిర్వహించిన మైనార్టీ గర్జన సభ విజయవంతమైంది. ఎన్నికలు లేవు అని.. ఓట్లకోసం సభ పెట్టలేదని రేవంత్ రెడ్డి మైనార్టీలలో భరోసానింపాడు.
దేశానికి స్వాతంత్య్రం తేవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగింది, నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెసేనని రేవంత్ గుర్తు చేశారు. మైనార్టీలు ఒకసారి ఆలోచించాలన్నారు. వైఎస్సార్ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతోమంది మైనార్టీలకు అవకాశాలు లభించాయన్నారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు.
కాంగ్రెస్ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. కారునో, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరేనని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలంటి చట్టాలు తెచ్చే దైర్యం చేసేవారా అని ప్రశ్నించారు.
మోడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉన్నదీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనని రేవంత్ అన్నారు. అసద్ చెప్పారనే మైనార్టీల ఓట్లు కెసిఆర్ కు వెళ్లాయన్నారు. కార్ కా స్త్రీరింగ్ అసద్ చేతిలో ఉందని చెప్పుకునే అసద్, త్రిబుల్ తలాక్ అనుకూలంగా రంజిత్ రెడ్డి ఎట్లా ఓటు వేస్తారని ప్రశ్నించారు. మైనార్టీలకు ఎవరివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలని మైనార్టీ గర్జన చేపట్టామన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆరెఎస్ కు వేస్తే ఓటు బీజేపీకి వెళ్తుందన్నారు.
దళితులకంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారన్నారని రేవంత్ రెడ్డి అన్నారు.జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారన్నారు., ఇంతవరకు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదన్నారు. మైనార్టీలకు శత్రువైన కేసిఆర్ ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు రాలేదు కానీ కేసిఆర్ కు ప్రగతి భవన్ భవంతి, కాళేశ్వరం ప్రాజెక్టు దక్కిందని రేవంత్ ఆరోపించారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూంలు ఇవ్వకపోయినా కనీసం 10 లక్షలు లోన్లయినా ఇప్పించండి , కష్టపడి పనిచేసి 12 లక్షలు కడుతామని రేవంత్ అన్నారు.
మోడీ రాక్షసుడు అయన ప్రాణం కెసిఆర్ లో ఉంది అంటూ పిట్టకథ చెప్పిన రేవంత్ నవ్వులు పూయించారు. మోడీకి మద్దతుగా నిలిచే కెసిఆర్ పార్టీని ఓడించాల్నారు. కెసిఆర్ కారును జుమ్మెరాత్ బజార్ కు పంపాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. 12 శాతం రిజర్వేషన్ ఇస్తే 20,30 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన కేసిఆర్ ప్రతి ముస్లిం కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలన్నారు. దళిత లెక్క మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంకాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యూడిషరీ పవర్స్ కల్పిస్తామని హామీ ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మైనార్టీలను ఆకర్షించేలా ఉన్నాయి.