కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవ్వరు? పలు కీలకమైన నిర్ణయాలు మంత్రులతో సంబంధం లేకుండానే అమలుకు నోచుకొంటూ ఉండడంతో ఇటువంటి అనుమానం కలుగుతున్నది. ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించే సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మంత్రిత్వ శాఖలో జరిగిన తాజా నిర్ణయం ఈ సందర్భంగా వివాదాస్పదంగా మారుతున్నది.
రెండు మలయాళ వార్తా ఛానళ్లపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ తీసుకున్న నిర్ణయం సంబంధిత మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియకుండానే వెలువడిన్నట్లు తెలుస్తున్నది.
మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తెలియకుండానే జరిగిపోయిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్.బీ.ఏ. అధ్యక్షుడు రజత్ శర్మ డిమాండ్ చేయడం గమనార్హం. కేరళలో ఉన్న ఏషియానెట్ న్యూస్‌తో పాటు మీడియా వన్ ఛానల్ పై నిషేధం విధించడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గతంలో పెద్ద నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం కూడా అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వు బంక్ లతో సంబంధం లేకుండా జరిగిన్నట్లు వార్తా కధనాలు వచ్చాయి. గత ఏడాది బాలాకోట్ లో వైమానిక దాడుల విషయం కూడా అప్పటి రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ కు తెలియకుండానే జరిగిన్నట్లు చెబుతారు.