AP New Disticts: ఏపీలో ఇప్పుడు ‘కొత్త జిల్లాల’ లోకం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు ఆనందడోలికల్లో మునిగితేలుతున్నారు. కొత్త జిల్లా ఏర్పడితే కొత్తగా జిల్లా స్థాయి పదవులు పెరుగుతుండడంతో నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కార్పొరేషన్ పదవులు డబులు అవుతుండడం.. వాటిని దక్కుతాయన్న సంతోషం నేతల్లో వెల్లివిరిస్తోంది.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో మొత్తం సంఖ్య 26కు చేరాయి. రెవెన్యూ డివిజన్లు కూడా విభజించారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు పెద్ద జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒక్క మంత్రి పదవి ఇచ్చిన జగన్.. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రాతిపదికనే కొత్త మంత్రి పదవులు కేటాయించనున్నారు. ఇదే ఇప్పుడు నేతల్లో జోష్ నింపనుంది.
ఇన్నాళ్లు జిల్లాకు ఒక్కటి మాత్రమేనని.. అతిపెద్దదైన చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ అయిన పెద్దిరెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారు. అదే సామాజికవర్గానికి చెందిన రోజాకు అన్ని అర్హతలు ఉన్నా ఇవ్వలేకపోయారు.కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి నియోజకవర్గం తిరుపతికి షిఫ్ట్ అయిపోయింది. చిత్తూరు జిల్లాలో రోజా మిగిలింది. ఇక చిత్తూరు మూడు ముక్కలై రాజంపేట మరో జిల్లాగా అవతరించింది. ఇప్పుడు చిత్తూరు నుంచి రోజాను, తిరుపతి నుంచి పెద్దిరెడ్డిని తీసుకునే వీలు జగన్ కు చిక్కింది. దీనిద్వారా చాలా మందికి మంత్రి పదవులను కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే వీలు కలుగుతోంది.
ఇక ఉత్తరాంధ్రలోనూ ఇవే లాభాలు కలుగుతున్నాయి. అరకూ, పార్వతిపురం సహా చాలా కొత్త జిల్లాలకు ఒక కొత్త మంత్రి పదవి దక్కనుంది. ఇన్నాళ్లు అరకు విశాఖలో ఉండడంతో ఆయా వర్గాలకు పదవుల్లో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ఇప్పుడు కొత్త జిల్లాలతో ఆలోటు భర్తీ కానుంది.
ఇక అనంతపురం లాంటి పెద్ద జిల్లాను విభజించి పుట్టపర్తి కేంద్రం మరోజిల్లాను ఏర్పాటు చేసి అక్కడ కూడా రాజకీయ ప్రాధాన్యం కల్పించారు. ఇలా కొత్త నేతలకు కొత్త జిల్లాలతో కావాల్సిన పదవులు దక్కుతాయి. చాలా మందికి రాజకీయ భిక్ష దొరకనుంది. కొత్త నేతలు పుట్టుకొస్తున్నారు.