https://oktelugu.com/

Steel Bridge In Hyderabad: హైదరాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి కథేంటి? ఎందుకు ఆయన పేరు పెడుతున్నారు?

రహదారి ఇరుకుగా ఉండటంతో స్టీల్‌ బ్రిడ్జి ఉత్తమమని ఇంజినీర్ల బృందం అభిప్రాయపడింది. అదనంగా భూమిని సేకరిస్తే.. వందల భవనాలు కూల్చాల్సి వచ్చేది. వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 18, 2023 10:19 am
    Steel Bridge In Hyderabad

    Steel Bridge In Hyderabad

    Follow us on

    Steel Bridge In Hyderabad: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అతిపెద్ద విగ్రహం.. రాజదర్పణం ప్రదర్శిస్తున్న సచివాలయం.. తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి.. ఇవి విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో మణిహారాలుగా నిలవగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరొకటి చేరబోతుంది. అదే ఉక్కు వంతెన. సాధారణ బ్రిడ్జిలకు భిన్నంగా ఉండే ఆ ఉక్కు వంతెన.. దక్షిణ భారతదేశంలోనే మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జి. ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేలా రాజధాని నడిబొడ్డున నిర్మించిన ఉక్కు వంతెన.. మెట్రో పైనుంచి ఉండటం మరో ప్రత్యేకత. మరి, కాంక్రీట్‌ బ్రిడ్జి కాకుండా ఇక్కడ ఉక్కు వంతెన ఎంతవరకు సురక్షితం..? ఉక్కు వంతెన నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఎన్ని టన్నుల స్టీల్‌ను వాడారు..? తదితర ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

    దక్షిణ భారత దేశంలో పొడవైనది..
    హైదరాబాద్లో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాహనదారులపై ఆ భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం అనేక చోట్ల వంతెనల నిర్మాణాలు చేపడుతూ వస్తుంది. ఆ కోవలోకి చెందిందే స్టీల్‌ వంతెన. ఇది చాలా ప్రత్యేకం. కారణం ఇది ఉక్కు వంతెన. కాంక్రీట్‌ బ్రిడ్జిలకు ప్రత్నామ్నాయంగా ఉండే. ఈ బ్రిడ్జిని పూర్తిగా స్టీల్‌తోనే నిర్మించారు. ఫలితంగా దక్షిణ భారతదేశంలోనే రహదారిపై నిర్మించిన అతి పొడవైన మొదటి ఉక్కు వంతెనగా నిలుస్తుంది.

    ఇందిరా పార్క్‌ నుంచి వీఎస్టీ వరకు..
    నగరం నడిబొడ్డున ఎలాంటి భూసేకరణ చేయకుండా నిర్మించి మొదటి వంతెన ఇది. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ బస్‌ భవ¯Œ సమీపంలోని.. వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్లు నిర్మించారు. నిత్యం రద్దీగా ఉండే ఇందిరాపార్కు, ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్, సినిమా థియేటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్‌రోడ్డుతోపాటు విద్యానగర్‌ రోడ్డు మీదుగా వీఎస్టీ వరకు ఇక ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. ఈ మార్గంలో 30 నిమిషాలకుపైగా సాగే ప్రయాణం వంతెన నిర్మాణంతో 5 నిమిషాల్లోపే వెళ్లొచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

    రహదారుల అభివృద్ధిలో భాగంగా..
    జీహెచ్‌ఎంసీ రూ.30 వేల కోట్ల అంచనా వ్యయంతో.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో ఫ్లై ఓవర్‌ వంతెనలు, అండర్‌ పాస్‌లు, ఆర్యూబీలు, ఆర్వోబీలు వంటి 32 నిర్మాణాలు పూర్తిచేసింది. అయితే, ఆ వంతెనలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. రహదారిపై నుంచి 26.54 మీటర్ల ఎత్తులో ఈ ఉక్కు వంతెనను నిర్మించారు. ఈ ఉక్కు వంతెన 33వ ప్రాజెక్టుగా అందుబాటులోకి రాబోతుంది.

    భూసేకరణ చేయకుండా..
    రహదారి ఇరుకుగా ఉండటంతో స్టీల్‌ బ్రిడ్జి ఉత్తమమని ఇంజినీర్ల బృందం అభిప్రాయపడింది. అదనంగా భూమిని సేకరిస్తే.. వందల భవనాలు కూల్చాల్సి వచ్చేది. వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. దీంతో ఉక్కు వంతెన వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణ పనులకు 2020, జూలై 10న శంకుస్థాపన జరగగా.. సాంకేతిక కారణాలతో 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని మెట్రోరైలు పై భాగాన నిర్మితమైన మొదటి వంతెన కావడం మరో ప్రత్యేకత.

    మరికొన్ని ప్రత్యేకతలు…
    – ఈ స్టీల్‌ వంతెనను 4 లైన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
    – దీనికి 12,316మెట్రిక్‌ టన్నుల ఉక్కును వినియోగించారు.
    – రూ.450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఉక్కు వంతెనలో 81 స్టీల్‌ పిల్లర్లు, 426 దూలాలు ఉన్నాయి.
    – కాంక్రీట్‌ బ్రిడ్జిని నిర్మించడానికి సుమారు రెండేళ్ల సమయం పడుతుంది. అదే ఉక్కు వంతెనకైతే కేవలం 15 నెలలు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
    – కాంక్రీటు బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చయితే.. స్టీల్‌ బ్రిడ్జికి రూ.125 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
    – కాంక్రీటు బ్రిడ్జి 60 నుంచి 100 ఏళ్లు సేవలందిస్తే.. ఉక్కు వంతెన 120 సంత్సరాలకు పైగానే నిలుస్తుంది.

    రేపే ప్రారంభం
    ఉక్కు వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 19న (శనివారం) ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్‌ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఉదయం 11 గంటలకు వంతెన ప్రారంభం ఉంటుందని పేర్కొన్నారు.

    కార్మిక నేత పేరు..
    ఇక ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. నాయిని.. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని.. అలాగే, చాలాకాలం వీఎస్‌టీ కార్మికుల సంఘానికి సారథ్యం వహించారని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తుచేశారు. ముషీరాబాద్‌ కేంద్రంగా రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన వంతు సేవలందించారని.. వీఎస్టీ ఫ్యాక్టరీలో కార్మికుల యూనియన్‌ నేతగా దశాబ్దాల పాటు పనిచేసిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ వంతెనకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయనుందన్నారు.