Chandrababu Arrest: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి ఎన్నికలు వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును సాకుగా చూపి రాజకీయ లబ్ధి పొందడం కెసిఆర్ తో పాటు బి ఆర్ ఎస్ నాయకులకు అలవాటైన విద్యగా మారిపోయింది. తాజా ఎన్నికల్లో సైతం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుండడం విశేషం. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి. కానీ అధికార బి ఆర్ ఎస్ నాయకత్వం మాత్రం స్పందించలేదు. అక్కడక్కడా నాయకులు మాత్రం స్పందించారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణలో సైతం నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అప్పట్లో ఐటీ ఉద్యోగులను నియంత్రించేందుకు యాజమాన్యాలపై తెలంగాణ సర్కార్ ఒత్తిడి పెంచింది. ఆందోళనలు చేపడితే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలు హెచ్చరించేదాకా పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేశారు. ఆందోళన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని తేల్చేసినట్టు స్వయంగా కేటీఆరే ప్రకటించారు. ఏపీలో రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవలో తెలంగాణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళనలు, నిరసనలు చేపడితే హైదరాబాద్ ఐటి బ్రాండ్ దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో కేటీఆర్ వ్యూహం మార్చారు. ఐటీ ఉద్యోగులు, సెటిలర్ల ఓట్లకు గండి పడుతుందని భావించి మాట మార్చారు. రెండు రోజుల కిందట చంద్రబాబు అరెస్ట్ పై లోకేష్ చేసిన ట్విట్ పై స్పందించారు. తన బాధను వ్యక్తం చేశారు. లోకేష్ కు సానుభూతి తెలిపారు.
తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని దేశమంతా అనుకుంటుందని కామెంట్స్ చేశారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని తమ పార్టీకి చెందిన నేతలు సానుభూతి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి నేతలు ఏపీలో రాజకీయం పోరాటం చేస్తున్నారని.. ఇదే సమయంలో ఎంతమందితో గొడవ పెట్టుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. తమపై సానుభూతితో ఉన్నవారిని వదిలేసుకుంటారా అని వ్యాఖ్యానించారు. తమకు తెలుగుదేశం పార్టీలోని పలువురితో సత్సంబంధాలు ఉన్నాయని.. జగన్, పవన్, లోకేష్ లతో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని వివరించారు.
కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు కొనసాగాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సరిహద్దు నియోజకవర్గాలు, సెటిలర్స్, ఐటి ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో బి ఆర్ ఎస్ కు దెబ్బ తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్నచోట నష్టం తప్పదు అన్న అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో తన వ్యాఖ్యల ద్వారా జరిగిన నష్టాన్ని అధిగమించేందుకుగాను కేటీఆర్ గత కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతున్నారు. సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా సరే నేరుగా చంద్రబాబు అరెస్ట్ కు మద్దతుగా మాట్లాడటం లేదు. జగన్ సర్కార్ తప్పును తప్పు పట్టడం లేదు. ఆ నెపాన్ని బిజెపి పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.