Minister KTR: ‘పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి.. ఇంత తక్కువ వచ్చాయేంటని తండ్రి అడిగితే.. నా ఫ్రెండ్‌కు నాకంటే ఇంకా తక్కువొచ్చాయి నాన్న’ అని చెప్పినట్లు ఉంది. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తీరు. తెలంగాణ, హైదరాబాద్ గురించి గొప్పలు చెప్పుకోవడానికి మంత్రి కొన్ని రోజులుగా పక్క రాష్ట్రాలతో పోలుస్తున్నారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తనకన్న తక్కువ స్థాయిలో ఉన్నవారిని పోల్చుకోవడం సైకలాజికల్‌గా మనిషి నైజం. మంత్రిగా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ కామన్ మెన్‌లా.. చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది.
-రాష్ట్రం పేరెత్తకుండా.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు..
తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని చెబుతూనే.. పక్క రాష్ట్రంలో పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన.. ఏపీలో పరిస్థితికి, తెలంగాణలో పరిస్థితికి ఉన్న తేడాను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా రాష్ట్రం పేరెత్తలేదు. హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యుత్.. రోడ్ల నిర్వహణతో పాటుగా ఎక్కడా రూపాయి అవినీతికి ఆస్కారం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే సమయంలో పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని మిత్రులు చెప్పారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో పరిస్థితి అధ్వానం, అన్యాయంగా ఉందని చెప్పారు. తన మిత్రుడ సంక్రాంతికి పక్క రాష్ట్రంకు వెళ్లారని..అక్కడ మూడు రోజులు ఉండే సరికి అక్కడ అధ్వాన్న పరిస్థితుల గురించి తనతో షేర్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వాళ్ల ఊరు నుంచి వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారన్నారు. తాను చెప్పేదేది అతిశయోక్తి కాదన్నారు. పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవచ్చని సూచించారు. తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం కాదు.. మీరే వెళ్లి చూడండంటూ సూచించారు. పక్క రాష్ట్రం వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారని ధీమా వ్యక్తం చేసారు.
Also Read: Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లకు చెక్.. కేంద్రం కీలకనిర్ణయం.. ఏం జరుగనుంది?
పక్క రాష్ట్రంలో పరిస్థితిని బస్సులు పెట్టి జనాన్ని పంపి చూపించండంటూ మిత్రులు సూచించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అక్కడ విద్యుత్ లేదని.. రోడ్లు లేవని పేర్కొన్నారు. మౌలిక సదుపాయల్లో హైదరాబాద్ అద్బుతంగా ఉందని వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ కట్టాలంటే లంచాలు చెల్లించాల్సిందేనని.. అధికార – ప్రతిపక్షాలకు లంచాలు ఇచ్చి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ తెలంగాణలో భవనాల అనుమతుల్లో అవినీతి లేకుండా చేశామన్నారు. తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని చెప్పారు.
-ఉమ్మడి రాష్ట్రంలో ఇలా..
తెలంగాణ రాకముందు కరెంటు కోతలు ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే ఆ సమస్య లేకుండా చేశామన్నారు. సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని చెప్పుకొచ్చారు. ఎంత ఖర్చు చేసి తెలంగాణలో భవనాలు నిర్మించుకొనే వారి దగ్గర నుంచి రూపాయి లంచం తీసుకొనే పరిస్థితి లేదని కేటీఆర్ వివరించారు. ఇక, ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
-గతంలో కర్ణాటకపై విమర్శలు..
మంత్రి కేటీఆర్ గతంలో మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకపై ఇదే విధంగా విమర్శలు చేశారు. దేశంలో ఐటీలో నంబర్ వన్‌గా ఉన్న బెంగళూరు ప్రతిష్ట మసకబారుతోందన్నారు. అక్కడ మత కలహాలు, ప్రభుత్వ వైఫల్యంతో కార్పొరేట్ కంపెనీలు బెంగళూరు రావడానికి భయపడుతన్నాయని పేర్కొన్నారు. రెండేళ్లలో హైదరాబాద్ బెంగళూరును మించి పోతుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులో పెట్టుబడి పెట్టాలనుకునేవారు అక్కడకు వెళ్లకుండా హైదరాబాద్‌కు రావాలని కోరారు. దీనిపై ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సుధాకర్, ప్రతిపక్ష నేత డీకే.శివకుమార్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్వరాష్ట్రం గురించి గొప్పలు చెప్పుకోవడానికి పక్క రాష్ట్రాన్ని కించపర్చడం సరికాదని చురకలు అంటించారు.
-ఏపీ మంత్రులు ఆగ్రహం!
కేటీఆర్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్ ఖండించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందకు పొరుగు రాష్ట్రంపై నిందలు వేయడం సరికాదని విమర్శించారు. అభివృద్ధి మాటకొస్తే హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటో ఒక్కటైన చెప్పాలని సవాల్ చేశారు. ఆంద్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందో చూపిస్తామని.. నాలుగు కాదు.. 40 బస్సుల్లో రావాలి’ అని సీదిరి అప్పలరాజు అన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తి ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇలా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌ను ఆశ్రయించారని గుర్తుచేశారు. నాడు నేడు సాఫ్ట్‌వేర్ కావాలని అడిగినట్లు తెలిపారు. సొంతంగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి పాఠశాలలను అభివృద్ధి చేసుకోలేక తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్‌ను ఆశ్రయించడం వారి పరిస్థితికి నిదర్శనమన్నారు. మైకు దొరికిందని ఇష్టానుసారం మాట్లాడొద్దని సూచించారు. మరో మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ ఏపీ అంటే ఒక అమ్మ ఒడి, ఒక నాడు నేడు, ఒక రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ పెట్టుబడి, సంక్షేమ పాలన, ప్రతి ఆడపడుచు మోములో సంతోషం, నెరవేరుతున్న సొంతింటి కల గుర్తొస్తాయన్నారు. ఈ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ స్థానం, తెలంగాణ స్థానం చూడాలన్నారు.
– కేటీఆర్ కామెంట్స్ ను ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘కేటీఆర్ నోట…జగన్ విధ్వంసపాలన మాట.. అట్టుంటది ఒక్క చాన్స్ తోని..!’ అంటూ ఎద్దేవా చేశారు. ఇలా కేటీఆర్ ఏపీపై రాజేసిన మాటల మంటలు అంటుకుంటూ చెలరేగుతూనే ఉన్నాయి.
Also Read:Amazon Prime: అమెజాన్ ప్రైమ్ లో అత్యధికంగా చూసిన తెలుగు సినిమాలేంటో తెలుసా?