NIMS Hospital: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు మంచి రోజులు రాబోతున్నాయి. పురాతన కాలంనాటి ఈ ఆస్పత్రి భవనం రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడున్న 1,500 పడకల సామర్థ్యాన్ని పెంచబోతోంది. అదనంగా 2 వేల పడకలను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఈ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు.
కొత్తగా మూడు ప్రత్యేక బ్లాక్‌లు..
నిమ్స్ విస్తరణపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక బ్లాకులు ఉండేలా కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. మూడు ప్రత్యేక బ్లాకులను ప్రభుత్వం నిర్మించనుంది. మొత్తం ఎనిమిది అంతస్తుల్లో ఇది నిర్మితం కానుంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి నిమ్స్ విస్తరణను చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం కూడా పూర్తయితే మరో 2 వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా నిమ్స్ ఆసుపత్రి భవన సముదాయంలో అందుబాటులో ఉండే పడకల సంఖ్య 3,700కు పెరుగుతుంది.
నెలాఖరుకు గాంధీ సూపర్ స్పెషాలిటీ
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇది పూర్తయితే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుంది. హైదరాబాద్ శివార్లల్లో వెయ్యి పడకల సామర్థ్యం గల తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రుల విస్తరణ పనులను వేగవతం చేయాలని మంత్రి ఆదేశించారు.
గాంధీలో అవయవ మార్పిడి..
మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి డిక్లరేషన్లను స్వీకరించాలని, వాటి అవసరం ఉన్న వారికి అవయవాలను మార్పిడి చేసి, ప్రాణదానం చేయాలని సూచించారు. అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.