Botsa Satyanarayana
Botsa Satyanarayana: ఏపీ పాలిటిక్స్ లో బొత్స సత్యనారాయణ పరిచయం అక్కర్లేని పేరు. పిఎసిఎస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వరకు ఎదిగారు. ఒకానొక దశలో సీఎం రేసులో కూడా నిలిచారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా అనేక పదవులు నిర్వర్తించారు. విజయనగరం జిల్లాను తన రాజకీయ అడ్డాగా మార్చుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు చెక్ చెప్పేందుకు సొంత కుటుంబ సభ్యులే పావులు కదుపుతున్నట్లు సమాచారం.
చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న బొత్స సత్యనారాయణ జగన్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ హై కమాండ్ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను తప్పించి విజయనగరం ఎంపీగా పోటీ చేయించేందుకు సిద్ధపడుతోంది. చీపురుపల్లి నుంచి చిన్న శ్రీను ను పోటీ చేయించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇన్నాళ్లు తెరవెనుక ఉండి రాజకీయాలు చేసిన చిన్న శ్రీను.. ఇకపై తెర ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి మామ బొత్స సత్యనారాయణ అడ్డంకిగా నిలుస్తున్నారని భావిస్తున్నారు. ఈసారి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి అందుకోవాలని చిన్న శ్రీను వ్యూహం.
గతంలో మాదిరిగా బొత్స కుటుంబంలో ఐక్యత కొరవడింది. గత ఎన్నికల ముందే బొత్స కుటుంబం వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో కొనసాగిన బొత్స జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కానీ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా బొత్సను పార్టీలోకి తీసుకోవడం జగన్ కు అనివార్యంగా మారింది. ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసే సమయంలో చిన్న శ్రీను అన్నీ తానై వ్యవహరించారు. అటు జగన్ కు సైతం దగ్గరయ్యారు. అందుకే ఇప్పుడు బొత్స ను ఎంపీగా పంపించాలన్న ప్రతిపాదనను జగన్ ముందు పెట్టారు. ఆ స్థానం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చిన్న శ్రీను భావిస్తున్నారు.
ప్రస్తుతం బొత్స కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బడ్డుకొండ అప్పలనాయుడు కు వ్యతిరేకంగా బొత్స సోదరుడు లక్ష్మణరావు పావులు కదుపుతున్నారు. ఇది బొడ్డు కొండ అప్పలనాయుడు బావమరిది అయినా చిన్న శ్రీనుకు మింగుడు పడడం లేదు. ఈ విషయంలో మేనమామ బొత్స కంటే.. బావమరిది అయిన బొడ్డు కొండ వైపే చిన్న శ్రీను మొగ్గు చూపుతున్నారు. దీంతో కుటుంబంలో ప్రకంపనలు రేగుతున్నాయి. మరోవైపు బొత్స సోదరుడు, గజపతినగరం ఎమ్మెల్యే అప్పల నరసయ్యకు వ్యతిరేకంగా ఐపాక్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం.ఈ పరిణామాల క్రమంలో వైసీపీ నాయకత్వానికి చిన్న శ్రీను దగ్గరయ్యారు.
వైసీపీ ఆవిర్భావం తర్వాత బొత్స సత్యనారాయణ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో అనుచిత కామెంట్లు బొత్స నోటి వెంట నుంచి వచ్చాయి. అవన్నీ జగన్కు తెలుసు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న బొత్స.. వైసీపీని లైట్ తీసుకున్నారు. కానీ తరువాత ఆ పార్టీలోనే చేరవలసి వచ్చింది. అందుకే జగన్ నాటి పరిస్థితులను గుర్తుచేసుకొని చిన్న శ్రీనుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. జగన్ సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అవ్వాలని చిన్న శ్రీను భావిస్తున్నారు. బొత్స కు ఎంపీ స్థానానికి పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దానికి బొత్స ఎంతవరకు సమ్మతిస్తారో చూడాలి మరి.