
విశాఖ నగర వాసుల్లో ఇప్పుడు ఒక్కటే ఆలోచన బతికుంటే బాలుసాకు తిని బతకొచ్చు. నిన్న తెల్లవారు జామున చోటుచేసుకున్న ఎల్.జి దుర్ఘటన దృశ్యాలను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరోనా వైరస్ బారిన పడిన చికిత్స తీసుకుని బతికి బయటపడొచ్చు, విష వాయువు బారిన పడితే ఆ అవకాశం ఉండదనుకొంటున్నారు. గురువారం రాత్రి ఎల్.జి పాలిమర్స్ నుంచి తక్కువ స్థాయిలో విషవాయువు స్టైరిన్ లీక్ అయ్యింది. దీంతో రాత్రి నగరవాసులు చాలామందికి కంటిపై కునుకు లేదు. దీంతో సమీప జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన వారు ఇప్పుడు విశాఖ నుంచి యూ టర్న్ తీసుకుని సొంత గ్రామాల బాట పట్టారు.
విశాఖ ఘటనను తేలిగ్గా తీసుకోవద్దు…!
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి తదితర జిల్లాలకు చెందిన వారు సొంత గ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో నిన్నటి వరకూ ఖాళీగా ఉన్న రోడ్లన్నీ ఒక్కసారిగా వాహనాలతో రద్దీగా మారాయి. అయితే వీరి ఆశ నెరవేరలేదు. నగర శివారుల్లోని చెక్ పోస్టుల వద్ద వీరిని ప్రజలు నిలిపివేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందున వెళ్లేందుకు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్లే వారిని పైడి భీమవరం చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు. క్వారంటైన్ లో ఉండటానికి అంగీకరిస్తే వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి ఇళ్లకు వెళుతున్నారు. ఎల్.జి పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజీ సమస్యను నిపుణులు 24 గంటల్లో పరిష్కరిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!
మరోవైపు నగరంలో రెండు రోజుల నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న 5 పాజిటివ్ కేసులు గుర్తించగా, ఈ రోజు కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కరోనా కేసులు 57 గుర్తించగా వీరిలో 23 చికిత్స పొందడంతో కొలుకున్నారు. 33 చికిత్స పొందుతున్నారు. ఒక్కరు మరణించారు. దీంతో విశాఖ వాసులకు ముందు కరోనా వెనుక స్టైరిన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.