Mekathoti Sucharita: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ పార్టీల్లో అసంతృప్త నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గం నేతలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగితే ఓటమి తప్పదని భావిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ఆదేశాలతో పవన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశాలకు హాజరవుతున్నా లోలోపల మాత్రం మదనపడుతున్నారు. రాజకీయంగా లాస్ తప్పదని భావిస్తున్న చాలామంది ఎమ్మెల్యేలు లోపయికారీగా జనసేన నేతలకు టచ్ లోకి వెళుతున్నారు.

అయితే తాజాగా మరో కీలక పరిణామం ఒకటి బయటపడింది. గత కొద్దినెలలుగా వైసీపీ హైకమాండ్ తో అంటీముట్టనట్టుగా ఉన్న మాజీ హోం మంత్రి మేకపాటి సుచరిత జనసేనలో చేరతారన్న టాక్ వినిపిస్తోంది. గత ఏప్రిల్ లో జరిగిన మంత్రివర్గ పునర్విభజనలో ఆమె అమాత్య పదవి కోల్పోయారు. అప్పట్లో తనకు కొనసాగింపు ఇవ్వాలని విన్నవించారు. కానీ జగన్ పెడచెవినపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె రాజీనామా చేస్తారని వదంతులు వచ్చాయి. వివాదం ముదరడంతో రంగంలోకి దిగిన పెద్దలు దానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ తనకు పార్టీలో పొమ్మన లేక పొగ పెడుతున్నారని గత కొన్నిరోజులుగా ఆమె బాధపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకుండామొండి చేయి చూపుతారని కూడా ఆమె ముందుగానే గ్రహించారు. అందుకే జనసేనలోకి వెళ్లాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె గంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. మరికొద్ది నెలల పాటు వేచిచూసి ఆమె ముందుగా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ ను ప్రారంభించిన సుచరిత 2003లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ లో చేరారు. 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవిని వదులుకొన్నారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసి గెలుపొందారు. 2014లో టీడీపీ టిక్కెట్ ఆఫర్ చేసినా.. మరోసారి వైసీపీ తరుపున పోటీచేసి గెలుపొందారు.

2019లో కూడా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన హోం మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెకు మాటమాత్రంగానైనా చెప్పకుండా తొలగించారు. అటు తన ప్రత్యర్థిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను పార్టీలోకి రప్పించారు. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మరీ ప్రోత్సహిస్తున్నారు. పార్టీలో ప్రత్యర్థులకు హైకమాండే ప్రోత్సహిస్తోందన్న అనుమానం సుచరితలో వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మారడం శ్రేయస్కరమన్న నిర్ణయానికి వచ్చారు. జనసేన అయితే స్వేచ్ఛ ఉంటుందని భావించి అటువైపుగా అడుగులు వేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఆమె త్వరలో జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.