Meet Lieutenant Kashish Methwani: నేటి కాలంలో సోషల్ మీడియాలో కాస్త ఫేమస్ అయిపోతే చాలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. వివిధ సంస్థలకు ప్రయోజనకర్తలుగా ఉంటూ దండిగా వెనకేసుకుంటున్నారు. అలాంటిది మిస్ ఇంటర్నేషనల్ పురస్కారం దక్కించుకొని.. చేతిలో బోలెడు అవకాశాలు పెట్టుకొని.. అవేవీ తనకు వద్దనుకొంది ఈ అందాల కాశిష్ మెత్వాని. డబ్బు, సంపాదన, అందం కాదని.. దేశభక్తికి జై కొట్టింది. ప్రస్తుతం మన దేశంలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగంలో కీలక ఉద్యోగం చేస్తోంది.
మహారాష్ట్రలోని పూనే ప్రాంతానికి చెందిన మెత్వాన్ని 2023 లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకు మోడలింగ్, యాక్టింగ్ లో అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద సంస్థలు ఎర్ర తివాచీపరిచాయి. తమ సంస్థకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్ లో నటించాలని ఎన్నో అవకాశాలు లభించాయి. కొంతమంది నిర్మాతలైతే బ్లాంక్ చెక్ లు కూడా ఇచ్చారు. అయితే అవేవి కూడా ఆమెను కదిలించలేదు. ప్రేరేపించలేదు. ఆమె గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ దేశం మీదనే ప్రేమ ఉండేది. దేశం కోసం ఏదైనా చేయాలని కోరిక బలంగా ఉండేది. అదే ఆమెను ఇంత దూరం నడిపించింది. చివరికి దేశ సేవలో నిమగ్నం అయ్యేలా చేసింది.
మెత్వాని బయోటెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఉన్నతమైన మార్కులు రావడంతో ప్రఖ్యాతమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది. ఇంతలోనే ఆమె మిస్ ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొంది. అందులో ఆమె కిరీటం గెలుచుకుంది. ఈలో గానే ఫార్వర్డ్ యూనివర్సిటీ పీహెచ్డీ చేయాలని వర్తమానం కూడా పంపింది. కానీ ఇవేవీ కూడా ఆమెకు నచ్చలేదు. సినిమా ఆఫర్లను.. ఇంకా చాలా అవకాశాలను ఆమె వద్దనుకొంది. పిహెచ్డి చేయకుండా సిడిఎస్ ఎగ్జామ్ రాసింది. 2024 ఆమె ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో ఆమె జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. శిక్షణ మొత్తం పూర్తయిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ విభాగంలో ఆమె అత్యంత కీలకమైన ఉద్యోగంలో పనిచేస్తున్నారు. నేటి కాలంలో కాస్త ఫేమస్ కావడంతోనే భారీగా డబ్బులు సంపాదించి.. విపరీతంగా వెనుక వేసుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ మెత్వానీ అలా కాదు. ఆమెకు దేశమంటే ఇష్టం. దేశ సేవలో పాలుపంచుకోవడం అంటే మరింత ఇష్టం. అందువల్లే ఎయిర్ డిఫెన్స్ భాగంలో నారి శక్తిని ప్రదర్శిస్తోంది.