ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళగా పేరుగాంచింది మేడారం సమ్మక్క-సారక్క జాతర. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతరకు వెళ్లివచ్చేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అమ్మవార్లపై వాళ్లకు ఉన్న నమ్మకం ఒక కారణమైతే.. రెండేళ్లకోసారి జాతర జరగడం కూడా మరో కారణం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగాల్సిన జాతర తేదీలను నిర్ణయించారు నిర్వాహకులు.
2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 వరకు జాతర కొనసాగుతుందని ఆలయ పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తారు. 18న సమ్మక్క-సారక్క అమ్మవార్లకు భక్తులు మొక్కలు చెల్లించుకుంటారు. 19వ తేదీన దేవతల వన ప్రవేశం జరగడంతో జాతర ముగుస్తుంది.
ఇదిలాఉండగా.. కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో.. మే 1 నుంచి 15వ తేదీ వరకు మేడారం దర్శనాన్ని నిలిపేస్తున్నట్టు పూజారులు ప్రకటించారు. 15 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అందువల్ల భక్తులు ఎవరు కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు రావొద్దని సూచించారు.