Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్‌ను సోమవారం ఉదయం పాకిస్తాన్‌లోని కరాచీలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది.
ఆస్పత్రివద్ద గట్టి భద్రత..
కరాచీలోని ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కట్టదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్‌గా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా నిలిపివేత..
అండర్ వరల్డ్ డాన్ దావూద్‌పై విషప్రయోగం జరిగిందన్న వార్తతో పాకిస్తాన్‌లో కలకలం రేగింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపి వేసిందని వార్తలు వస్తున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి పెద్దనగరాల్లోనూ సర్వర్లు డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదు. రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్ బ్లాక్ సంస్థ పాకిస్తాన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు ధృవీకరించింది.
విషయం బయటకు రాకుండా..
దావూద్‌పై ఎవరో విషప్రయోగం చేశారని, క్రమంగా అతని ఆరోగ్యం క్షిణించడంతోనే అతడిని ఆస్పత్రికి తరలించారని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇంటర్నెట్ స్పీడ్ తగ్గించిందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిలిపివేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా మాత్రం ధృవీకరించడం లేదు. అయితే ఏదో చీకటి కోణం ఉందన్నది మాత్రం వాస్తవం అని పాకిస్తాన్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రెండో వివాహం తర్వాత..
ఇదిలా ఉండగా దావూద్ రెండో వివాహం చేసుకున్న అనంతరం కరాచీలో ఉంటున్నట్లు అతని సోదరి ఎన్‌ఐఏకు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది.