Jammu And Kashmir: సరిగ్గా గడిచిన సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర కారులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన కంటే ముందు దేశ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు నెట్వర్క్ మొత్తాన్ని మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు చేదించారు.. ఉగ్రవాదులు కదలికలను.. వారు చేపడుతున్న దుర్మార్గాలను ఒక్కొక్కటిగా వెలికి తీశారు.. ఇది జరుగుతుండగానే ఢిల్లీలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. దాదాపు 12 మంది చనిపోయారు.. పహల్గాం దాడి తర్వాత మళ్లీ మనదేశంలో అలజడి సృష్టించడానికి ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఢిల్లీలో జరిగిన ఘోరం గురించి దర్యాప్తు జరుగుతుండగానే.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు లోతుగా విచారణ చేస్తుండగానే.. అత్యంత సున్నితమైన జమ్ము కాశ్మీర్లో ముఖ్యంగా నౌగాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భారీ పేలుడు చోటుచేసుకుంది.. ఈ పేలుడులో 9 మంది భద్రతా సిబ్బంది దుర్మరణం చెందారు.. దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి హడావిడి కొనసాగుతుండగా ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల దాటిన తర్వాత ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుడులో సుమారు 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చనిపోయిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.
ఫరీదాబాద్ ప్రాంతంలో ఉగ్రదాడికి సంబంధించి ఇటీవల ఓ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అయితే వాటి నుంచి నమూనాలు సేకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.. పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిపోయాయి. దట్టమైన పొగ వ్యాపించింది.. పేలుడు తీవ్రతకు భవనాలు నేలమట్టమయ్యాయి. ఆ శిధిలాల కింద పడి చాలామంది సిబ్బంది చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇది శాంపిల్ సేకరిస్తుండగా చోటు చేసుకున్న పేలుడా? ఉగ్రవాదుల దుశ్చర్యా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అయితే కొన్ని మీడియాలో మాత్రం ఇది ఉగ్రవాదులు జరిపిన పేలుడు అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఒకవేళ పేలుడు పదార్థాల నుంచి నమూనాలు సేకరిస్తుంటే.. అంతటి ఆ జాగ్రత్తగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫరీదాబాద్ ఉగ్రకుట్ర లో భాగంగా 32 కార్లలో బాంబు పేలుడుకు ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో నాలుగు కార్లను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 28 కార్లు ఎక్కడ ఉన్నాయి.. వాటిలో ఏ స్థాయిలో పేలుడు పదార్థాలను నిల్వ చేశారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డే లేదా అని.. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.