
కరోనా కల్లోలం వేళ ఇప్పుడు ఏ ఇద్దరు కూడా గుమిగూడే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు, రాత్రి కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పండుగలు, పబ్బాలంటే పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు.
అయితే ఇవేవీ పట్టించుకోని ఓ పెళ్లికొడుకు పంజాబ్ లోని జలంధర్ లో ఎంచక్కా పెళ్లి చేసుకుంటున్నాడు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా బంధువులు వందల మందిని పిలిచి మాస్క్ లు పెట్టుకోకుండా తన పండుగ సంబురంలో తను ఉన్నాడు.
తాజాగా జరిగిన ఈ వేడుకకు వందమందికి పైగా హాజరయ్యారని.. తద్వారా కరోనా వ్యాపించిందని ఇది నిబంధనలకు విరుద్ధమని పోలీసులు సీరియస్ అయ్యారు.
వెంటనే పెళ్లి మంటపానికి చేరుకున్న పోలీసులు పెళ్లికొడుకును, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. వారంతపు కర్ఫ్యూను వారిద్దరూ ఉల్లంఘించారని.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వందమందికి పైగా అతిథులను పిలిచారని పోలీసులు కేసులు నమోదు చేశారు.
పంజాబ్ లో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే 30 వరకు ఇప్పటికే బార్లు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్ లు, కోచింగ్ సెంటర్లు, క్రీడా సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వివాహాలు వేడుకలకు కేవలం 20మందికి మాత్రమే అనుమతి.
అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లికొడుకు ఎంచక్కా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడంతో అతడిని అరెస్ట్ చేసి గట్టి షాక్ ఇచ్చారు పోలీసులు.