Manchu Manoj Second Marriage: మంచు మనోజ్.. తెలుగు సినీ పరిశ్రమలో సవాలక్ష హీరోల్లో ఇతను ఒకడు. పదులకొద్ది సినిమాలు చేసినా సరైన బ్రేక్ రాకపోవడంతో కొన్నాళ్లుగా బ్రేక్ తీసుకున్నాడు. అంతకుముందే ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినిమా వాళ్ల పెళ్లిళ్లు ఎంత గొప్పగా జరుగుతాయో.. బంధాలు కూడా అంతే ఘనంగా విచ్ఛిన్నమవుతాయి. ప్రణతితో విడాకులు తీసుకున్న తర్వాత మంచు మనోజ్ కుటుంబంతోనూ విడిగా ఉంటున్నాడు. ఆమధ్య అహం బ్రహ్మాస్మి అనే ఒక పాన్ ఇండియా సినిమా ప్రారంభించాడు. కానీ ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. అయితే మంచు మనోజ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఓ యువతిని పెళ్లాడనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మంచు మనోజ్ వివాహం చేసుకునే ఆ యువతి దివంగత భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల చిన్న కుమార్తె మౌనిక రెడ్డి. ఇటీవల హైదరాబాద్ నగరంలో మౌనిక రెడ్డి తో కలిసి ఓ గణేష్ మండపం వద్ద మంచు మనోజ్ పూజలు చేయడంతో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తకు బలం చేకూర్చింది.

..
ప్రణతితో మంచు మనోజ్ విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పెళ్లి పై రకరకాల ప్రచారాలు జరిగాయి. వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ వచ్చారు. ఇదే సమయంలో కోవిడ్ ప్రబలినప్పుడు సేవా భారతి ఆధ్వర్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలోనే వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇప్పుడు అప్పుడే తనకు రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని మంచు మనోజ్ తేల్చి చెప్పారు. ఇక భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో ఆమెకు మొదటి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం గణేష్ రెడ్డితో మౌనిక రెడ్డి విడాకులు తీసుకున్నారు. గణేష్ కుటుంబానిది చిత్తూరు జిల్లా. వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మౌనిక రెడ్డి హైదరాబాదులో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఇటీవల మంచు మనోజ్ ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అది కాస్త వివాహం చేసుకునే దాకా వెళ్ళింది. అయితే మౌనిక రెడ్డి, మనోజ్ చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని ఓ విల్లాలో ఉంటున్నారని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఇద్దరు హైదరాబాదులో కలిసే ఉంటున్నట్టు సమాచారం.
..
ఇదిలా ఉండగా గణేష్ మండపం వద్ద మౌనిక రెడ్డి తో కలిసి పూజలు చేసిన మంచి మనోజ్ ను పెళ్లి విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే పెళ్లి తన వ్యక్తిగత విషయమని, సందర్భం వచ్చినప్పుడు అందరికి చెబుతానన్నారు. అయితే పెళ్లి వార్తలను మంచు మనోజ్ ఖండించకపోవడం గమనార్హం. కాగా ఆ మధ్య భూమా మౌనిక రెడ్డి భూమా అఖిలప్రియ పై మియాపూర్ లో భూ వివాదానికి సంబంధించి కేసు నమోదు అయినప్పుడు మంచు మనోజ్ అండగా ఉన్నారని, అప్పుడే మౌనిక రెడ్డి తో ప్రేమ చిగురించిందని సమాచారం. ఇద్దరి మొదటి పెళ్లిళ్లు పెటాకులు అవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారని, అందులో భాగంగానే కలిసి ఉంటున్నారని వారి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కాగా ఇటీవల చంద్రబాబు నాయుడుని మంచు మోహన్ బాబు, కుమార్తె లక్ష్మి ప్రసన్నతో కలిసి భేటీ అయ్యారు. మంచు మనోజ్ మౌనిక రెడ్డి పెళ్లి విషయం గురించే మాట్లాడేందుకు చంద్రబాబును కలిశారని సమాచారం. అయితే దీనిపై మోహన్ బాబు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తిరుపతికి సమీపంలోని రంగంపేట వద్ద తాను నిర్మించిన సాయినాధుడి గుడికి సంబంధించి మాట్లాడేందుకే కలిశానని మోహన్ బాబు వివరించారు. అయితే భూమ మౌనిక రెడ్డి కి చెందిన కొన్ని ఆస్తుల వివాదాలు కోర్టులో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. అయితే అవన్నీ పరిష్కారమైన తర్వాతే మంచు మనోజ్ తో వివాహం జరిపించాలని అఖిల ప్రియ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.