పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు సార్లు అధికారంలో ఉన్న టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్)పార్టీ మూడోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ అధినేత మమతా బెనర్జీ నందిగ్రాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆరునెలల్లో చట్టసభకు ఎన్నిక కావాలి. దీంతో ఆమె అదృష్టం కొద్దీ మూడు అవకాశాలున్నాయి. వాటిలో ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.
ఇదే పరిస్థితి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనైతే ఎమ్మెల్సీ కోటా ద్వారా ఎన్నిక కావచ్చు. కానీ బెంగాల్ లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 1969లో నాటి కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఆ ఛాన్స్ లేదు. పోని ఇప్పటికిప్పుడు మండలిని పునరుద్ధంచాలన్నా అందుకు అవకాశం లేదు. అందుకు కేంద్ర సమ్మతి కావాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్రం ఆ చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఎలక్షన్ ద్వారానే ఎన్నిక కావాల్సి ఉంది.
అయితే బెంగాల్లో మూడు చోట్ల ఉప ఎన్నికకు అవకాశం ఏర్పడింది. ఇందులో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసి గెలుపొందాలని మమత ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కరోనాతో మరణించారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇక ముర్సీదాబాద్ జిల్లాలోని జంగీపూర్లో రివల్యూషన్ అభ్యర్థి (ఆర్ఆర్పి) ప్రదీప్ నంది కరోనాతో మరణించారు. శంషేర్ గంజ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అంటువ్యాధితో మరణించారు. ఈ రెండు స్థానాల ఎన్నికను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది.
జంగీపూర్లో 2006లో ఆర్ఎస్పీ, 2011లో కాంగ్రెస్, 2016లో టీఎంసీ విజయం సాధించాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇక్కడి నుంచే రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇక ఖర్దాహా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి 18 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శంషేర్ గంజ్ లో 2011లో సీపీఎం, 2016లో టీఎంసీ విజయం సాధించాయి. దీంతో మూడు నియోజకవర్గాల్లోనూ టీఎంసీకి ఆశలున్నాయి. అయితే ఆమె గెలుపు పెద్ద విషయం కాకపోయినా ఇప్పటి నుంచే టీఎంసీ నాయకులు కసరత్తులు మొదలుపెట్టారు.