
కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రతను అందరూ గుర్తించారు. కేసుల సంఖ్య కంటే మరణాలే అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఉత్పత్తిలో ఆలస్యం కారణంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరగడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఇలాగేకొనసాగితే కరోనా నుంచి కోలుకోవడం కష్టపమని కొందరు వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని అది మొదలైతే మరింత తీవ్రత ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల కారణంగా సెకండ్ వేవ్ లో కరోనా కేసులు అధికంగా పెరిగాయని కొందరు అనుకున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా క్రమంగా కేసులు తగ్గుతున్నా.. వాటి ప్రభావం మే చివరి నాటికి ఉంటుందని అంటున్నారు. మే చివరి నాటికి తమిళనాడులో, మే 31 లోపు అస్సాంలో కేసులు పెరుగుతాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన నిపుణులకమిటీ రిపోర్టు చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు పీక్ స్టేజికి వెళ్లాయని తెలిపింది.
జూలైలో సెకండ్ వేవ్ ముగిసిన తరువాత ఆరు నెలల కాలానికి థర్డ్ వేవ్ ఉధృతి తలెత్తొచ్చని ఆ కమిటీ పేర్కొంది. అయితే ఈలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగితే థర్డ్ వేవ్ నుంచి కాపాడుకోవచ్చని అంచనా వేసింది. అయితే సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో ప్రభుత్వ కమిటీ విఫలమైందని, అయినా అప్రమత్తమయ్యేసరికి ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయన్నారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ విషయంలో దృష్టి పెట్టాలని ఆ కమిటీ సూచించింది.