Malla Reddy- BJP: ‘నేనెవలూ.. మల్లారెడ్డి.. ఈ ఆస్పత్రులు ఎవరివీ మల్లారెడ్డివి.. మల్లారెడ్డి అంటే ఎవలూ.. మంత్రి మల్లారెడ్డి.. నాకు 600 భూమి ఉంది.. మెడికల్ కాలేజీలు ఉన్నయ్.. వ్యాపారాలు ఉన్నయ్..’ ఇలా తన గురించి తరచూ డబ్బా కొట్టుకునే వ్యక్తి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. భూముల కొనుగోలు, అమ్మకాలు, మెడికల్ కళాశాలలు, ఇతర వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తిన మల్లారెడ్డి రాజకీయమే ప్రత్యేకం. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేయడం ఆయనకు అలవాటు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారిగా ఉన్న మల్లారెడ్డి.. రాజకీయాలపై మక్కువతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి, తెలంగాణలో ఒకసారి టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్నారు.

ఐటీ దాడులతో బీజేపీవైపు చూపు..
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారరం జరుగుతోంది. ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారన్న విషయం ఒక్క సారిగా గుప్పుమంది. ‘అదేంటి ఆయన మొన్నే కదా ఐటీ అధికారులపై సైతం దాడుల్లాంటి వాటికి ప్రయత్నించి.. కేసీఆర్ ఉండగా తనకేం కాదని.. ప్రకటించారు’ కదా అనుకుంటున్నారు. అదే మరి మల్లారెడ్డి రాజకీయం. కేసీఆర్‌పై అంత విశ్వాసం ప్రకటించి.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా అన్న ఆశ్చర్యం చాలా మందిలో ఉంది. అయితే తెర వెనుక విషయాలు మాత్రం మెల్లగా వెలుగులోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
గులాబీ బాస్ మౌనం అందుకేనా..
మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలంతా ఇటీవల సమావేశమయ్యారు. మామూలుగా ఇలాంటి సమావేశాలు.. పార్టీ హైకమాండ్‌కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తాయి. కానీ మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంపై పార్టీ హైకమాండ్ పెద్దగా స్పందించలేదు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వారు .. గ్రూపుగా తిరుమల కూడా వెళ్లారు. దీనిపై బీఆర్‌ఎస్‌లో పెద్దగా హడావుడేం జరగడం లేదు. ఎందుకంటే.. వారు మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించింది.. హైకమాండ్ సూచనలతోనే అన్న సమాచారం బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడుల తర్వాత వారి వ్యవహారాలు మొత్తం బయట పడ్డాయి. మెడికల్ కాలేజీలు.. ఇంజినీరింగ్ వ్యవహారాల్లో ఈడీని కూడా రంగంలోకి దిగారని ఐటీ కోరింది. కానీ ఈడీ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. మామూలుగా అయితే ఈడీ కూడా సెర్చె చేసి ఉండేది దీనంతటికి కారణం .. మల్లారెడ్డి బీజేపీతో టచ్‌లోకి వెళ్లారని.. జంప్ అవడానికి ఓకే చెప్పారన్న విషయం.. బీఆర్‌ఎస్ హైకమాండ్ కు తెలిసిందని సమాచారం. అందుకే గులాబీ బాస్ తాను సైలెంట్‌గా ఉండి.. అసమ్మతిని ప్రోత్సాహిస్తున్నారని గులాబీ నేతల టాక్.

కొత్త ఏడాదిలో బర్తరఫ్..
తెలంగాణ కేబినెట్‌లో మరో మంత్రి బర్తరఫ్ కాబోతున్నారు. కొత్త ఏడాది జనవరిలో ఇందుకు కేసీఆర్ ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఈటల రాజేందర్ తరహాలోనే బీజేపీతో టచ్‌లోకి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలపై ఫిర్యాదు చేయించి బర్తరఫ్ చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలిసింది. అప్పటిలోగా మల్లారెడ్డి బీజేపీలో చేరికపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో వేచిచూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి మల్లారెడ్డి రాజకీయం మరో మలుపు తిరగబోతోందని.. తెలంగాణలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ టూ బీజేపీ వయా బీఆర్‌ఎస్ అన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.