Mahasena Rajesh- TDP: వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకం. ఒకరకంగా చెప్పాలంటే ఆ పార్టీకి, చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. గెలిస్తే పర్వాలేదు కానీ.. పొరపాటున ఓడితే మాత్రం పార్టీ మనుగడ కష్టమే. అందుకే దానిని గుర్తెరిగి చంద్రబాబు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కుమారుడు లోకేష్ తో పాదయాత్ర చేయిస్తున్నారు. తాను అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అంటూ వినూత్న కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళుతున్నారు. అటు పార్టీలో చేరికలను కూడా ప్రోత్సహమిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు నేతల చేరిక సొంత పార్టీలో నాయకులకు మింగుడు పడడం లేదు. చంద్రబాబు చర్యలను తప్పుపడుతూ కొందరు నేతలు ఏకంగా లేఖలు రాయడం కలకలం సృష్టిస్తోంది. పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనలు పూర్తిచేశారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. తొక్కిసలాట ఘటనలతో కాస్తా బ్రేక్ ఇచ్చినా..రేపటి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు సిద్ధపడుతున్నారు. వీటికి సంబంధించి ఆ జిల్లా శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే ఈ నెల 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు మహాసేన రాజేష్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే రాజేష్ చేరికను టీడీపీలో ఉన్న కొంతమంది దళిత నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కానీ పార్టీలో తీసుకుంటే మేము ఉండలేమంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఏకంగా అధినేతకే లేఖ రాసి అల్టిమేటం జారీ చేస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు మహాసేన రాజేష్ వైసీపీలో చేరారు. జగన్ విజయానికి గట్టిగానే పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్థాయికి మించి కామెంట్స్ చేశారు. టీడీపీలో ఉన్న దళిత నాయకులను వైసీపీలో చేరేలా ఒత్తిడి చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎస్సీలను వైసీపీ వైపు టర్న్ అయ్యేందుకు కృషిచేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. దాదాపు ఆ పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలో టీడీపీ నుంచి ఆహ్వానం రావడంతో చంద్రబాబు సమక్షంలో చేరడానికి గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే మహాసేన రాజేష్ ను కానీ టీడీపీ చేర్చుకుంటే జరగబోయే పరిణామాల గురించి టీడీపీ దళిత ఐక్యవేదిక ప్రతినిధులు చంద్రబాబుకు లేఖ రాశారు. మూకుమ్మడి రాజీనామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన ఏదో ఆశించి పార్టీలో చేరుతున్నాడని.. ఇన్నాళ్లూ తాము ఏమీ ఆశించకుండా పనిచేశామని వారు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ టీడీపీ గెలిస్తే ఆ విజయాన్ని రాజేష్ తన ఖాతాలో వేసుకుంటాడని.. అలాంటి వారిని చేర్చుకొని పార్టీ విలువలను దిగజార్చవద్దని దళిత నాయకులు చంద్రబాబును గట్టిగానే హెచ్చరిస్తున్నారు. సరిగ్గా పార్టీలో చేరికల ముందు ఏమిటీ ఉపద్రవం అంటూ టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. మరి ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాలి మరీ.
Also Read:CM Jagan- Kodali Nani: కొడాలి నానిపై సీఎం జగన్ ఆగ్రహం.. అసలేంటి వివాదం