Mahalakshmi
Mahalakshmi : ఎన్నికల ప్రచారంలో లగ్జరీ బస్సులలో కూడా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కానీ వాస్తవంలో అది సాధ్యం కాకపోవడంతో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం లభించిన నేపథ్యంలో బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో పురుషులకు కూర్చోవడానికి సీట్లు కూడా లభించడం లేదు. ఈ క్రమంలో ఆర్టీసీ వ్యూహాత్మకంగా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను పెంచింది. అంతేకాదు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి.. డీజిల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్టీసీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారం పూర్తిగా తగ్గుతోంది. పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ చేస్తేనే నడుస్తాయి కాబట్టి.. పర్యావరణ కాలుష్యం కూడా ఉండడం లేదు. అయితే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి ప్రయాణికులు అధికంగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో.. రద్దీ ఏర్పడుతోంది. ఆ రద్దీని నివారించడానికి ఆర్టీసీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఉపకరిస్తున్నాయి.
ఇందులోనూ ఫ్రీనే
ఎలక్ట్రిక్ బస్సులు చూసేందుకు సూపర్ లగ్జరీ బస్సులను పోలి ఉన్నాయి. ఇందులో సీటింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంది. లగ్జరీ సీట్లు కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇందులో కూడా మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇవి పుష్ అప్ సీట్లు కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. మరోవైపు ఈ బస్సులకు గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడంతో డ్రైవర్లు కూడా ఇబ్బందులేకుండా నడపగలుగుతున్నారు. డీజిల్ తో నడిచే బస్సుల కైతే ఎప్పటికప్పుడు గేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా వాటికి నిర్వహణ భారం కూడా అధికంగా ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సులకు అలాంటి అవసరం ఉండదు. కేవలం ఎక్స్ లెటర్.. బ్రేకులు మాత్రమే అవసరం ఉంటాయి. పూర్తిగా చార్జింగ్ బ్యాటరీల ద్వారా ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ బస్సులను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించడంతో… ఆర్టీసీపై అద్దె భారం కూడా తగ్గుతోంది. అయితే ఈ బస్సుల్లో కేవలం టికెట్లు కొని ప్రయాణించే వారికి మాత్రమే అవకాశం కల్పించాలని ఆర్టీసీ మొదట్లో భావించింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో మహాలక్ష్మి పథకానికి కూడా తర్వాత అనుమతి ఇచ్చింది. దీంతో లగ్జరీ బస్సుల్లో ఉచితంగానే మహాలక్ష్మి ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణం ఆనందంగా ఉందని.. ఎటువంటి కుదువులకు గురికాకుండానే తమ గమ్యస్థానాలకు చేరుతున్నామని మహాలక్ష్మి ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.