KCR New party: సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో అజ్ఞాతవాసం వీడి బయటకు వస్తున్నారు. మంత్రులతో కేబినెట్ మీటింగ్ కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదేనెలలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
ఫాంహౌస్ లో సుధీర్ఘ చర్చల అనంతరం కేసీఆర్ ఈనెలాఖరులోనే కొత్త జాతీయ పార్టీని ప్రకటిస్తారని సమాచారం. కొత్త జాతీయ పార్టీపై మంత్రులు, ఎంపీల అభిప్రాయాలను తెలుసుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ పార్టీకి పనిచేస్తానని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. తాజా రాజకీయాలు, కొత్త జాతీయ ప్రత్యామ్మాయం.., రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభా వర్షకాల సమావేశాలపై మంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించారు. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ గురించి ప్రస్తావించినట్టు సమాచారం.
‘భారత రాష్ట్రీయ సమితి’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేద్దామని.. ఈనెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
దేశంలో బీజేపీ ఆగడాలు.. ప్రత్యామ్మాయంగా కాంగ్రెస్ ఎదగలేని పరిస్థితుల్లో ఉండడంతో దేశ ప్రజలంతా ఇప్పుడు ప్రత్యామ్మాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆ పాత్రను కొత్త జాతీయ పార్టీ పోషిస్తుందని పేర్కొంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలను దీనికి వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. పలు పార్టీలను ఏకం చేసి ఎన్టీఏ అభ్యర్థిని ఓడించాలని.. తద్వారా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు.
రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు రుణాలపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందని.. కేంద్రం తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని కేసీఆర్ చూస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని చక్కదిద్దేందుకు కొత్త పార్టీ అవసరం ఉందని నేతలతో సీఎం అన్నట్టు సమాచారం. మంత్రులు కూడా కేసీఆర్ తో కలిసి నడించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరి కేసీఆర్ జాతీయ రాజకీయాల పయనం ఎలా సాగుతుందన్నది వేచిచూడాలి.