https://oktelugu.com/

పేదలపై గ్యాస్‌ బండ.. : సబ్సిడీకి కేంద్రం మంగళం

హమ్మయ్యా..! ఒకటో తారీఖు వచ్చింది.. అయినా గ్యాస్‌ ధరలు పెరగలేదు అని అందరూ సంబురపడ్డారు మొన్నటివరకు. కానీ.. కేంద్రం ఆ సంబరాన్ని ఎన్నో రోజులు ఉండనివ్వలేదు. వెంటనే బ్యాడ్‌ న్యూస్‌ చెప్పేసింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు గ్యాస్ సిలిండర్‌‌ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అంతేకాదు.. ఇన్ని రోజులు గ్యాస్‌ సిలిండర్లపై కేంద్రం ఇచ్చిన సబ్సిడీని కూడా ఎత్తేయబోతోన్నట్లు తెలుస్తోంది. Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2021 / 10:36 AM IST
    Follow us on

    హమ్మయ్యా..! ఒకటో తారీఖు వచ్చింది.. అయినా గ్యాస్‌ ధరలు పెరగలేదు అని అందరూ సంబురపడ్డారు మొన్నటివరకు. కానీ.. కేంద్రం ఆ సంబరాన్ని ఎన్నో రోజులు ఉండనివ్వలేదు. వెంటనే బ్యాడ్‌ న్యూస్‌ చెప్పేసింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు గ్యాస్ సిలిండర్‌‌ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అంతేకాదు.. ఇన్ని రోజులు గ్యాస్‌ సిలిండర్లపై కేంద్రం ఇచ్చిన సబ్సిడీని కూడా ఎత్తేయబోతోన్నట్లు తెలుస్తోంది.

    Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్

    కేంద్రం వంటగ్యాస్‌ సబ్సిడీకి బడ్జెట్‌లో కేటాయింపులు పూర్తిగా తగ్గించింది. 2020–-21 బడ్జెట్‌లో రూ.40,915 కోట్ల కేటాయింపులు చేశారు. కానీ.. 2020 ఏప్రిల్‌ నుంచి ఇంత వరకు నయాపైసా విడుదల చేయలేదు. వినియోగదారులకు సబ్సిడీ(డీబీటీ) ఇవ్వలేదు. ఇక 2021–-22 ఆర్థిక సంవత్సరానికి రూ.12,995 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 1న ప్రకటించారు. కానీ.. గతేడాది బడ్జెట్‌ నుంచి నయాపైసా ఇవ్వని కేంద్రం… ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు ఇస్తుందా..? అనే గ్యారెంటీ ఏమీలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వంట గ్యాస్‌ సబ్సిడీ బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని ఉజ్వల పథకం కింద పేదలకు కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడానికి వాడతారని సమాచారం.

    గతేడాది మే నెల నుంచి అంటే.. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత నుంచి కేవలం రూ.40.72 మాత్రమే అకౌంట్లలో సబ్సిడీ పడుతోంది. నిజానికి వంటగ్యాస్‌ ధర పెరిగిన కొద్దీ సబ్సిడీ మొత్తం పెరగాలి. కేంద్రం సిలిండర్‌ ధర పెంచినప్పుడల్లా పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడుతోందన్న భ్రమలో ఉన్నాం. నిజానికి కరోనా రావడానికి ముందు ప్రభుత్వం అలాగే చెల్లించేది. గత మే నుంచి గప్‌చుప్‌గా ఆ పద్ధతికి స్వస్తి పలికింది. సిలిండర్‌ ధర ఎంత ఉన్నా కేవలం రూ.40.72 వేసి చేతులు దులుపుకుంటోంది. 2014–-15లో మోదీ సర్కారు వంట గ్యాస్‌ ధరలను మార్కెట్‌ శక్తులకు వదిలేయాలని నిర్ణయించినపుడు ఆ ఏడాదికి ఒక్కో సబ్సిడీ సిలిండర్‌ మీద రూ.563 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్లో సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. ఆరేళ్లలో సిలిండర్‌ రేటుతోపాటు సబ్సిడీ తగ్గిపోతూ ఇప్పుడు రూ.40 అయింది. అది కూడా చమురు కంపెనీలే ఇస్తున్నట్లు సమాచారం. అంటే, కేంద్రం ఇస్తున్నది సున్నా. ఈ పరిణామాలన్నీ చూస్తే వంట గ్యాస్‌ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసినట్లేనని అంతా భావిస్తున్నారు. గ్యాస్‌ డీలర్లు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

    నిన్నా మొన్నటివరకు ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.746.50 ఉండేది. గురువారం నుంచి మరో రూ.25 అదనంగా పెరిగి, రూ.771.50 పైసలకు చేరింది. ఇందులో కేంద్రంపైసా సబ్సిడీ ఇవ్వటంలేదు. కేవలం ఓఎంసీ(ఆయిల్‌ మార్కెటింగ్‌) కంపెనీ ఒక్కో సిలిండర్‌కు రూ.40 చొప్పున వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తోంది. అంటే ఒక్కో సిలిండర్‌ రూ. 731.50 కు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దీనిని చాలా భారంగా భావిస్తున్నారు.

    Also Read: పార్లమెంట్ లో గళం.. ఏపీకి వైసీపీ ఎంపీలు ఏం సాధించారో తెలుసా?

    ఈ చర్య వల్ల కిరోసిన్, గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించడం లేదా మొత్తం సబ్సిడీని ఎత్తేయడం జరుగుతుందని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, సిలిండర్‌ లభిస్తోంది. దీని ద్వారా ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. కాగా.. ప్రస్తుతం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం కింద కేంద్రం అల్పాదాయ వర్గాలకు ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీని ఇస్తున్నారు. ఇక భారతదేశంలో సుమారు 28 కోట్ల ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 1.5 కోట్ల మంది సబ్సిడీకి అనర్హులు. వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్నవారికి ఈ సబ్సిడీని కట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. తాజా బడ్జెట్ కేటాయింపులు దాదాపు 20 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ పొందే లబ్ధిదారులపై ఎఫెక్ట్ పడనుంది.

    ఇప్పటివరకు వంటగ్యాస్‌ ధరలను నెలకోసారి (ఒకటో తేదీన) సవరిస్తున్నారు. సిలిండర్‌ ధర పెరిగినా, తగ్గినా… నెల రోజులపాటు అదే అమలులో ఉంటుంది. ఇకనుంచి వారానికోసారి వంటగ్యాస్‌ ధరలను సవరించాలని ప్రతిపాదనలు రాగా, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి సర్క్యులర్‌ జారీచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పెట్రోలు ధరలను ఆయిల్‌ కంపెనీలు ప్రతిరోజూ సవరిస్తున్నాయి. ఏ రోజుకారోజు పెట్రోలు, డీజిలు ధరలు మారుతున్నాయి. అదే తరహాలో వంటగ్యాస్‌ ధరలను కూడా వారానికోసారి సవరించాలని నిర్ణయించాయి. ఈ లెక్కన నెలకు నాలుగు సార్లు గ్యాస్‌ ధరల్లో మార్పు ఉంటుంది. ఇప్పటికే డీబీటీ సిస్టమ్‌ను దాదాపుగా ఎత్తివేయగా… ఇకముందు వారానికోసారి గ్యాస్‌ ధరలు సవరిస్తే మరింత అన్యాయం జరుగుతుందని వంట గ్యాస్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

    -శ్రీనివాస్