Telangana BJP: ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పటి వరకు ఒక లెక్క.. అన్నట్లుగా బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ దూకుడు పెంచింది. ఒక దశలో అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీ బీజేపీనే అన్నస్థాయికి చేరుకుంది. జనం కూడా కమలం పార్టీని విశ్వసించారు. పాదయాత్రలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. కానీ కర్నాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంతో పార్టీ ఎన్నికల రేసులో పూర్తిగా వెనుకబడింది. ఈ క్రమంలో కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో కాంగ్రెస్ పుంజుకుంది.
మళ్లీ రేసులోకి బీజేపీ..
తాజాగా బీజేపీ మళ్లీ రేసులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అది అధికారం కోసం కాకుండా గేమ్ చేంజర్ కావాలనుకుంటోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని తాము లేకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే రావొద్దని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా వారం వ్యవధిలోనే తెలంగాణలో పర్యటించారు. మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటించారు. కృష్ణాజలాల్లో వాటా తేల్చేందుకు కమిటీ కూడా వేశారు. ఇక అమిత్‌షా వచ్చాక పార్టీలో జోష్ పెరిగింది. కేసీఆర్, కేటీఆర్‌ను మోదీ, షా ఎండగట్టారు. అవినీతి పాలనను అంతం చేద్దాం.. డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అంటూ పిలుపునిచ్చారు.
వరుస సభలు..
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో వరుస సభలతో తెలంగాణను హోరెత్తించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈమేరకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ప్రచార రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారంలో కీలకం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది.
బీజేపీ లెక్కలు ఇవీ..
అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు అంచనాలను సొంత సర్వేలతో అంచనా వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా తమ అంతర్గత సర్వే ద్వారా 30 నుంచి 50 సీట్ల వరకు గెలుస్తామన్న అంచనాలో ఉంది. నిజామాబాద్‌లో 5 నుంచి 7 సీట్లు, ఆదిలాబాద్‌లో 3–5, సికింద్రాబాద్‌లో 3–5, చేవెళ్లలో 3–4, మల్కాజ్‌గిరిలో 2–3, నాగర్ కర్నూల్‌లో 2–3, కరీంనగర్‌లో 2–3, భువనగిరిలో 2–3, జహీరాబాద్‌లో 1–2, మెదక్‌లో 0–2, వరంగల్‌లో 1–2, మహబూబ్‌నగర్‌లో 1–2, మహబూబాబాద్‌లో 0–1, పెద్దపల్లిలో 0–1 సీట్లు గెలుస్తామని అంచనాలు వేసుకుంది. ఓవరాల్‌గా చూస్తే 25 నుంచి 45 సీట్లలో బీజేపీ గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారు.
మేనిఫెస్టో తర్వాత..
ఇక బీజేపీ ఈసారి తెలంగాణలో నిర్మాణాత్మకమైన మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోంది. గతంలో ఎన్నడూ మేనిఫెస్టో ఇవ్వలేదు. కానీ, ఈసారి కచ్చితంగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని కసరత్తు చేస్తోంది. ఈమేరకు మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ మేనిఫెస్టో తర్వాత ఓట్లు, సీట్ల అంచనాలు మారతాయని కమలనాథులు విశ్వసిస్తున్నారు.