వైఎస్సార్ సీపీ నేతలు తమ నోటికి పని చెబుతున్నారు. తిట్ల పురాణం అందుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేకత కలిగిన కొడాలి నాని మరోసారి తన తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. నారా లోకేష్ పై తమ ఇష్టానుసారం బూతులు ప్రయోగిస్తున్నారు. మూడు రోజుల కిందట కర్నూలు జిల్లాలో టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఫ్యాక్షన్ హత్యలకు గురయ్యారు.
వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లిన లోకేష్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన లోకేష్ ప్రతీకారం ఉంటుందని ప్రకటించారు. ఇంకా కుక్క అనే పదం వాడారు. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో కూడా స్పష్టత లేదు. వైసీపీ కుక్కలను అన్నారు. ఎప్పుడూ పరిధి దాటకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడే లోకేష్ కర్నూలులో అలా మాట్లాడటం వైరల్ అయింది.
ఇది వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. దీంతో రంగంలోకి దిగిపోయారు. లోకేష్ మహా అయితే ఒక మాట మాత్రమే అనగలను. కానీ తమకు అంతకు మించి భాషా సామర్థ్యం ఉందని తేల్చిచెప్పారు. నిజానికి వైసీపీ నేతల భాషా సామర్థ్యంపై ఎవరికి అనుమానం లేదు. గత రెండేళ్ల నుంచి వారి సామర్థ్యాన్ని చెవులరా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మరో స్టేజ్ కు వెళ్తున్నారు.
లోకేష్ ఎవరిని అంటున్నారో తెలయకుండా కుక్క అని తిట్టినందుకే ఆవేశపడి ఇలా తిడుతున్నారు. లోకేష్ వారిని రెచ్చొట్టారన్నమాట. నిజానికి ఇలా బూతులు తిట్టుకుంటే ఎవరికి నష్టం లేదు. గతంలో మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడతారని అనుకునేవారేమో కానీ ఇప్పుడు అలవాటు పడిపోయారు. కానీ మాట్లాడే వారికే ప్రజల్లో ఓ రకమైన ఇమేజ్ వస్తోంది. ఆ విషయం గుర్తుంచలేకపోతున్నారు.